IND vs SL Test series, Pink Ball Test: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా తొలి వికెట్‌ చేజార్చుకుంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (4) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. బంగారం లాంటి అవకాశాన్ని మిస్‌ చేసుకున్నాడు. 7 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 24/1తో ఉంది. రోహిత్‌ శర్మ (15), హనుమ విహారి (౩) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. కాగా కీలకమైన డే/నైట్‌ టెస్టులో హిట్‌మ్యానే టాస్‌ గెలిచి బ్యాటింగ్‌  ఎంచుకున్నాడు. అక్షర్‌ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నాడు.
 
టీమ్‌ఇండియాలో ఒక ఓపెనర్‌ ఇలా రనౌట్‌ అవ్వడం 2012 తర్వాత ఇదే తొలిసారి. 2012లో వీరేంద్ర సెహ్వాగ్‌ ఇలాగే ఔటయ్యాడు. ప్రస్తుత మ్యాచులో సురంగ లక్మల్‌ వేసిన 1.4వ బంతిని మయాంక్‌ ఆడాడు. మయాంక్‌ ప్యాడ్లకు బంతి తగలడంతో లంకేయులు ఎల్బీ అప్పీల్‌ చేశారు. అంపైర్‌ అనిల్‌ చౌదరి దానిని తిరస్కరించాడు. అయితే బంతి కవర్స్‌ వైపు వెళ్తుండటంతో మయాంక్‌ పరుగు తీయడం మొదలుపెట్టాడు. అవతలి ఎండ్‌లోని రోహిత్‌ ఇందుకు సిద్ధంగా లేడు. వెనక్కి వెళ్లాలని సూచించాడు. ఇంతలోనే కవర్స్‌లోని జయ విక్రమ బంతిని అందుకొని కీపర్‌ డిక్వెలాకు విసిరాడు. అతడు వికెట్లను గిరాటేశాడు. 


ఔటయ్యాడో లేదో అని వీడియో రిప్లేలను చూస్తే బౌలర్‌ క్రీజు దాటి బంతి వేశాడని తెలిసింది. నోబాల్‌గా ప్రకటించినప్పటికీ మయాంక్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. బెంగళూరు అతడి సొంత మైదానం. దేశవాళీ క్రికెట్లో మయాంక్‌ కర్ణాటకకే ఆడతాడు.


టీమ్‌ఇండియా తుది జట్టు: మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, హనుమ విహారి, విరాట్‌ కోహ్లీ, రిషభ్ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా