శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. 400 పరుగుల లోటుతో ఫాలోఆన్‌లో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యం సంపాదించింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా నాలుగేసి వికెట్లు తీయగా... మహ్మద్ షమీకి రెండు వికెట్లు దక్కాయి. బ్యాటింగ్‌లో 175 పరుగులు చేయడంతో పాటు మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


400 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. 19 పరుగులకే ఓపెనర్ లహిరు తిరిమన్నె (0: 9 బంతుల్లో), ఫాంలో ఉన్న పతుం నిశ్శంక (6: 19 బంతుల్లో, ఒక ఫోర్) అవుటయ్యారు. ఏ దశలోనూ శ్రీలంక బ్యాటర్లు కనీస పోటీ ఇవ్వలేదు.


పిచ్ స్పిన్‌కు సహకరించడంతో అశ్విన్, జడేజా ద్వయం చెలరేగిపోయారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ శ్రీలంకను అస్సలు కోలుకోనివ్వలేదు. నిరోషన్ డిక్‌వెల్లా, ధనంజయ డిసిల్వ (30: 58 బంతుల్లో, ఐదు ఫోర్లు) మాత్రమే 30 పరుగుల మార్కును చేరుకున్నారు. 121 పరుగుల స్కోరు వద్దనే శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయింది. చరిత్ అసలంకను (20: 9 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) అశ్విన్ అవుట్ చేయగా... ఏంజెలో మ్యాథ్యూస్ (28: 75 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), సురంగ లక్మల్ (0: 3 బంతుల్లో) వికెట్లను జడ్డూ దక్కించుకున్నాడు.


ఆ తర్వాత టెయిలెండర్ల వికెట్లను వీరు చకచకా తీసేయడంతో శ్రీలంక 178 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు చెరో నాలుగు వికెట్లు తీశారు. మిగతా రెండు వికెట్లూ మహ్మద్ షమీకి దక్కాయి.


భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌటయింది. 400 పరుగుల భారీ లోటు ఉండటంతో భారత్ ఏమాత్రం ఆలోచించకుండా శ్రీలంకను మళ్లీ ఫాలో ఆన్‌కు దించింది. రెండో ఇన్నింగ్స్‌లో లంక పరుగులకు 178 ఆలౌట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగులతో విజయం సాధించింది.