IND vs SL, 1st Test, Mohali: మొహాలి టెస్టులో టీమ్‌ఇండియా (Team India) అదరగొట్టింది! తొలి టెస్టు తొలిరోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఫ్లాట్‌గా కనిపించిన పిచ్‌పై హిట్‌మ్యాన్ సేన సమష్టిగా రాణించింది. ముఖ్యంగా రిషభ్ పంత్ (96; 97 బంతుల్లో 9x4, 4x6) ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌కు స్టేడియం ఊగిపోయింది! లంక జట్టు వణికిపోయింది. హైదరాబాదీ క్రికెటర్ హనుమ విహారి (58; 128 బంతుల్లో 5x4) అర్ధశతకంతో రాణించాడు. మిడిలార్డర్ సెటప్‌ను పూర్తిగా మార్చేసిన టీమ్‌ఇండియా తొలిరోజు ఆధిపత్యం చెలాయించింది. రవీంద్ర జడేజా (45 బ్యాటింగ్; 82 బంతుల్లో 5x4), రవిచంద్రన్ అశ్విన్ (10 బ్యాటింగ్; 11 బంతుల్లో 2x4) అజేయంగా నిలిచారు.
విహారీ సునాయసంగా..
టీమ్‌ఇండియా తొలిసారి సీనియర్ క్రికెటర్లు చెతేశ్వర్ పుజారా (Cheteswar Pujara), అజింక్య రహానె (Ajinkya Rahane)ను పక్కనపెట్టి బరిలోకి దిగింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (33; 49 బంతుల్లో 5x4), రోహిత్ శర్మ (29; 28 బంతుల్లో 6x4) మంచి ఈజ్‌తో కనిపించారు. సునాయాసంగా బౌండరీలు కొట్టేశారు. తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇన్నింగ్స్ 9.5వ బంతికి రోహిత్‌ను ఔట్ చేయడం ద్వారా కుమార ఈ జోడీని విడదీశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన హైదరాబాదీ క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) నయావాల్ పుజారా లోటును తీర్చాడు. బ్యాటును చక్కగా మిడిల్ చేశాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) (45; 76 బంతుల్లో 5x4)తో కలిసి 90 పరుగుల పార్ట్‌నర్‌షిప్ అందించాడు. మరోవైపు వందో టెస్టు ఆడుతున్న కింగ్ కోహ్లీ కూడా సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటవ్వడంతో 199/4తో టీమ్‌ఇండియా తేనీటి విరామానికి వెళ్లింది.
పంత్ పవర్ హిట్టింగ్
మూడో సెషన్లో రిషభ్ పంత్ హవా కొనసాగింది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) (27; 48 బంతుల్లో 3x4)తో కలిసి ఐదో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అయ్యర్ ఔటయ్యాక అసలు సిసలు పంత్‌ను బయటకు తీసుకొచ్చాడు. 75 బంతుల్లో 50 చేసిన అతడు మరో 10 బంతుల్లోనే 82 స్కోరుకు వెళ్లాడు. క్రీజు నుంచి బయటకొచ్చి ఒంటిచేత్తో సిక్సర్లు, బౌండరీలు దంచికొట్టాడు. చూస్తుండగానే సెంచరీకి చేరువయ్యాడు. అతడి ధాటికి ఏం చేయాలో లంకేయులకు అర్థమవ్వలేదు. అయితే రెండో కొత్త బంతి అందుకున్నాక వికెట్ టు వికెట్ వేసిన సురంగ లక్మల్ 80.5 బంతికి పంత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఐదోసారి నర్వెస్ నైంటీసీలో ఔటైన పంత్ నిస్తేజంగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత జడేజా, అశ్విన్ ఆట ముగించారు. లసిత్ ఎంబుల్‌దెనియా 2 వికెట్లు తీశాడు. సురంగ లక్మల్, విశ్వా ఫెర్నాండో, లాహిరు కుమార, ధనంజయ డిసిల్వా తలో వికెట్ దక్కించుకున్నారు.