సెంచూరియన్‌లో వాతావరణం ఎలా ఉంది? వర్షం పడుతూనే ఉందా? ఈ రోజైనా కాస్త తెరపినిస్తుందా? కొంత ఆటైనా సాగుతుందా? జరిగితే ఎన్ని ఓవర్లు ఆట కొనసాగిస్తారు? వంటి ప్రశ్నలు భారత అభిమానుల నుంచి వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే రెండో రోజు, సోమవారం ఆట రద్దవ్వడమే కారణం.


అభిమానులకు శుభవార్త! మూడు రోజు, మంగళవారం ఆట కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సెంచూరియన్‌ వాతావరణం నేడు ప్రశాంతంగా ఉంది. ఆక్యూవెదర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం మంగళ, బుధవారాల్లో వర్షం కురిసే అవకాశాలు లేవు. కాబట్టి రోజుకు 98 ఓవర్ల పాటు మ్యాచ్‌ కొనసాగిస్తారని తెలిసింది.


ఇప్పటి వరకు ఏం జరిగిందంటే?


తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 90 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (122 బ్యాటింగ్: 248 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) శతకం సాధించగా.. తనతోపాటు అజింక్య రహానే (40 బ్యాటింగ్: 81 బంతుల్లో, 8 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (60: 123 బంతుల్లో, 9 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఆడటంతో మొదటి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా పడలేదు. లంచ్‌ సమయానికి టీమిండియా 28 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 83 పరుగులు సాధించింది.


రెండో సెషన్‌లో కూడా టీమిండియా ఓపెనర్లు ఎటువంటి తడబాటు లేకుండా ఆడారు. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో మయాంక్ అగర్వాల్ తన అర్థసెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు.ఈ క్రమంలోనే రాహుల్, మయాంక్ మొదటి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. మొదటి వికెట్‌కు 117 పరుగులు జోడించిన అనంతరం ఎంగిడి బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఆ తర్వాతి బంతికే పుజారా (0: 1 బంతి) కూడా పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాహుల్‌కు కెప్టెన్ కోహ్లీ జతకలిశాడు. మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం లుంగి ఎంగిడి బౌలింగ్‌లోనే విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. 


ఆ తర్వాత రహానే, కేఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా ఆడారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ శతకం కూడా పూర్తయింది. దీంతో భారత్ మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు సాధించింది. రెండో రోజు వర్షం ఆగిన తర్వాత మైదానం తడిగానే ఉండటంతో ఆటను రద్దు చేశారు.