Jadeja on Twitter: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు ఓ కొత్త ఫ్రెండ్‌ దొరికింది. ఓ పావురాన్ని అతడు మచ్చిక చేసుకున్నాడు. తన భుజంపై వాలిన పావురాయిని నిమురుతూ ఫొటోలు దిగాడు. వాటిని ట్విటర్లో అభిమానులతో పంచుకున్నాడు. తనకో కొత్త ఫ్రెండ్‌ దొరికిందని పోస్టు చేశాడు. 'కొత్త మిత్రుడిని చేసుకున్నాను. పీస్‌ఫుల్‌' అంటూ దానికి వ్యాఖ్యను జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.


రవీంద్ర జడేజా ప్రస్తుతం ఇంటివద్దే ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీసుకు అతడిని ఎంపిక చేయలేదు. ఐపీఎల్‌ 2022లో గాయపడటమే ఇందుకు కారణం. ఈ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు అతడు నాయకత్వం వహించాడు. వరుస ఓటములు ఎదురవ్వడంతో ఒత్తిడికి గురయ్యాడు. తిరిగిన నాయకత్వ బాద్యతలను ఎంఎస్‌ ధోనీకే అప్పగించాడు. తన బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌పై ఏకాగ్రత సారిస్తానని చెప్పాడు. కానీ ఆ తర్వాత ఓ మ్యాచులో ఫీల్డింగ్‌ చేస్తూ అతడు గాయపడ్డాడు. దాంతో సీజన్‌ మొత్తానికీ దూరమయ్యాడు.


ఇదిలా ఉంటే రవీంద్ర జడేజాను ఉద్దేశపూర్వకంగానే కెప్టెన్సీ నుంచి తప్పించారని అభిమానులు విమర్శిస్తున్నారు. అంతకన్నా ప్రమాదకరమైన ఫీల్డింగ్‌ ఫీట్లే చేసినప్పుడు అవ్వని గాయం ఇప్పుడెలా అయిందని ప్రశ్నించారు. అందుకే అతడి ఇన్‌స్టాగ్రామ్‌ను సీఎస్‌కే అన్‌ఫాలో చేసిందని ఆరోపించారు.


అప్పుడేం జరిగిందంటే?


ఈ సీజన్‌కు ముందు రవీంద్ర జడేజా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. రూ.16 కోట్లకు అతడిని సీఎస్‌కే రీటెయిన్‌ చేసుకుంది. ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌ కెరీర్‌ చరమాంకంలో ఉండటంతో భవిష్యత్తు సారథిగా జడ్డూపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సీజన్లో మహీ ఉంటాడు కాబట్టి వచ్చే సీజన్లో అతడిని కెప్టెన్‌గా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తొలి మ్యాచుకు రెండు రోజుల ముందుగా అతడిని కెప్టెన్‌గా ప్రకటించారు. ఈ సారి సరైన ఆటగాళ్లు లేకపోవడంతో జట్టు వరుసగా ఓటముల పాలైంది. మరోవైపు జడ్డూ రాణించలేదు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు.


సగం సీజన్‌ ముగిసిన తర్వాత జడ్డూ కెప్టెన్సీని మహీకి తిరిగి అప్పగించాడని యాజమాన్యం ప్రకటించింది. తన ఆటపై శ్రద్ధ పెట్టేందుకు జడ్డూనే ఈ నిర్ణయం తీసుకున్నాడని వెల్లడించింది. అప్పుడే అందరికీ అనుమానాలు వచ్చాయి. సాధారణంగా క్రికెట్లో ఏ స్థాయిలోనూ జడేజా కెప్టెన్సీ చేయలేదు. అలాంటప్పుడు అతడికి ఒకట్రెండు సీజన్లు అవకాశం ఇవ్వడం ధర్మం! విఫలమయ్యే ఆటగాళ్లకే పదేపదే ఛాన్సులిచ్చే సీఎస్‌కే అతడిని తొలగించింది! ఇక బెంగళూరు మ్యాచులో ఫీల్డింగ్‌ చేస్తూ జడ్డూ గాయపడ్డాడు. తీవ్రత తగ్గకపోవడంతో ముందు జాగ్రత్తగా అతడిని ఐపీఎల్‌ నుంచి తప్పిస్తున్నామని బుధవారం సీఎస్‌కే ప్రకటించింది. గతంలో అంతకన్నా ప్రమాదకరమైన ఫీల్డింగ్‌ ఫీట్లు చేసినప్పడే ఇబ్బంది పడని జడ్డూ ఇప్పుడెలా గాయపడ్డాడని చాలా మంది సందేహించారు.


జడ్డూను సీఎస్‌కే అన్‌ఫాలో చేసిందని వార్తలు రాగానే అనుమానాలు మరింత బలపడ్డాయి. 'సీఎస్‌కే యాజమాన్యం, ఎంఎస్‌ ధోనీ కలిసి జడేజాతో ఛీప్‌ పాలిటిక్స్‌ చేశారు. కెప్టెన్‌గా అతడిని బలిపశువును చేశారు. సీజన్లో ఘోర ప్రదర్శనకు కారణంగా మార్చారు. ఆ తర్వాత అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఆ తర్వాత జడ్డూ కెప్టెన్సీని ధోనీ విమర్శించాడు. ఆ తర్వాత సీఎస్‌కే అతడిని అన్‌ఫాలో చేసింది. ఇప్పుడు ఆ బెస్ట్‌ ప్లేయర్‌పై వేటు వేసింది. ఇది కచ్చితంగా జడ్డూను అవమానించడమే' అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.