టీమ్‌ఇండియా 'ఇద్దరు మిత్రులు' అదరగొట్టారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (46; 84 బంతుల్లో 7x4), కేఎల్ రాహుల్ (29; 84 బంతుల్లో 4x4) అద్భుతంగా ఆడారు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ తొలి సెషన్‌లో అజేయంగా నిలిచారు. లంచ్ సమయానికి 28 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేశారు. 2007 తర్వాత ఆసియా ఆవల టీమ్‌ఇండియా తొలిరోజు తొలి సెషన్లో వికెట్ పోకుండా ఆడటం ఇదే తొలిసారి. రోహిత్, రాహుల్ ఈ ఏడాది ఆరంభంలో లార్డ్స్‌లో చేసినా.. ఆ మ్యాచ్ వర్షంతో ఆగిపోయింది.
వర్షం కురిసే పరిస్థితులు.. చల్లని వాతావరణం.. టాస్ గెలిస్తే ఏ కెప్టెనైనా దాదాపుగా బౌలింగ్ తీసుకుంటాడు. కానీ విరాట్ కోహ్లీ రక్షణాత్మక విధానానికి అస్సలు మొగ్గు చూపలేదు. గెలవడానికే వచ్చామని సంకేతాలు ఇస్తూ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టే ఓపెనర్లు మయాంక్, రాహుల్ ఆడారు. తొలి పది ఓవర్లు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. బౌలర్లకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. 17వ ఓవర్లో జెన్‌సన్ బౌలింగ్‌లో జీవనదానం లభించాక మయాంక్ రెచ్చిపోయాడు. సఫారీ బౌలర్లు సహనం కోల్పోగానే చూడచక్కని బౌండరీలు బాదేశాడు. అతడి మిత్రుడు రాహుల్ సైతం కళ్లకు ఇంపైన కవర్‌డ్రైవ్‌లతో అలరించాడు. వీరిద్దరూ ఆఫ్‌సైడ్ బంతులను వదిలేసి లెగ్‌సైడ్ బంతుల్ని శిక్షించారు. లంచ్ సమయానికి మెరుగైన స్కోరు అందించారు. టీమ్ఇండియా ఓపెనర్లు విదేశాల్లో అర్ధశతకానికి పైగా భాగస్వామ్యం అందిస్తే 2020లో ఓడిపోయిందే లేదు.