IND vs SA 4th T20: భారత్, దక్షిణాఫ్రికా నాలుగో టీ20 టాస్ వేశారు. టీమ్‌ఇండియా కెప్టెన్ రిషభ్ పంత్ వరుసగా నాలుగోసారి టాస్ ఓడిపోయాడు. తెంబా బవుమా భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌పై ఎక్కువ పరుగులు వస్తాయి కాబట్టి ఛేజింగ్‌కు దిగుతామని వెల్లడించాడు. టాస్ గెలిస్తే తామూ బౌలింగే తీసుకోవాలని నిర్ణయించుకున్నామని పంత్ చెప్పాడు. మధ్య ఓవర్లలో ఎక్కువ రన్స్ చేయడంపై దృష్టి పెట్టామన్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించాడు.
IND vs SA T20 Playing XI
భారత్: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, తెంబా బవుమా, వాండర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డ్వేన్ ప్రిటోరియస్, లుంగి ఎంగిడి, మార్కో జన్‌సెన్, కేశవ్ మహరాజ్, ఆన్రిచ్ నోకియా, తబ్రైజ్ శంషి
పరుగుల పండగ
రాజ్ కోట్ అంటేనే పరుగుల వరదకు మారుపేరు! ఇదే వేదికలో 2013లో టీమ్‌ఇండియా 202 టార్గెట్‌ను ఛేదించింది. 2017లో న్యూజిలాండ్ 196 టార్గెట్‌ను రక్షించుకుంది. 2019లో బంగ్లాదేశ్‌పై భారత్ మరో నాలుగు ఓవర్లు ఉండగానే 154 రన్స్‌ను విజయవంతం ఛేజ్ చేసింది. కాగా స్టేడియంలో నేడు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం టీమ్‌ఇండియా భారీ పరుగులు చేయక తప్పదు.
గెలిస్తేనే సిరీస్
తొలి రెండు మ్యాచులు ఓడిన టీమ్‌ఇండియా విశాఖలో తిరిగి పుంజుకుంది. 48 పరుగుల తేడాతో గెలుపు తలుపు తట్టింది. రాజ్‌కోట్‌లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేస్తే తిరుగుండదు. ఓపెనర్లు రుతురాజ్, ఇషాన్ ఫామ్‌లో ఉండటం శుభసూచకం. స్పిన్‌లో దూకుడుగా ఆడుతున్న శ్రేయస్ పేస్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నాడు. దీన్నుంచి బయటపడాలి. ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాలి. హార్దిక్ పాండ్య పరిణతితో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆఫ్ స్టంప్ ఆవల వేసిన బంతులను రిషభ్ పంత్ ఆడలేకపోతున్నాడు. ఈ టోర్నీలో రన్సేమీ చేయలేదు. ఫినిషర్‌గా డీకేకు ఎక్కువ అవకాశాలేమీ రాలేదు. యూజీ, అక్షర్ పుంజుకోవడం గుడ్‌న్యూస్. భువీ తన స్వింగ్‌తో మాయ చేస్తున్నాడు. హర్షల్, అవేశ్ ఫామ్ అందుకోవడంతో ఉమ్రాన్, అర్షదీప్‌కు ఎదురు చూపులు తప్పవు.