దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన విరాట్ కోహ్లీ.. మూడో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడాడు. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో టెస్టు ఆడటానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఈ మ్యాచ్ తన కెరీర్‌లో 99వ టెస్టు కానుంది.


‘నేను ఇప్పటిదాకా సాధించిన దాన్ని చూసి గర్వపడుతున్నాను. నేనెవరికీ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అది బయటివారి పని. నేను కెప్టెన్ అయినప్పుడు, ఆ దారిలో మా ప్రయాణాన్ని చూసుకున్నప్పుడు మేం సాధించిన దాన్ని నమ్మడం కొంచెం కష్టంగానే ఉంది. జట్టు మొత్తం పిచ్చిగా కష్టపడింది. అందువల్లే మేం విజయవంతం అయ్యాం. ఆ ప్యాషన్ లేకపోతే.. వ్యూహాలు రచించి విజయవంతం కాలేం.’ అని కోహ్లీ ఈ ప్రెస్‌మీట్‌లో చెప్పాడు.


ఇక మహ్మద్ సిరాజ్ ఫిట్‌నెస్ గురించి కూడా విరాట్ మాట్లాడాడు. ‘మూడో మ్యాచ్ ఆడటానికి సిరాజ్ సిద్ధంగా ఉన్నాడని నేను అనుకోవడం లేదు. ఫిట్‌గా లేని ఫాస్ట్ బౌలర్‌ను ఆడించడం ఈ సమయంలో కొంచెం రిస్కే.’ అని తెలిపాడు.







భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మూడో టెస్టు కేప్‌టౌన్‌లో జరగనుంది. ఈ స్టేడియంలో భారత్ ఇంతవరకు ఐదు టెస్టులు ఆడగా.. మూడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే దక్షిణాఫ్రికా గడ్డపై ఇదే మనకు తొలి టెస్టు సిరీస్ విజయం అవుతుంది. ఈ సిరీస్ మొదటి టెస్టులో భారత్ విజయం సాధించగా.. రెండో టెస్టును దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది.


అశ్విన్‌పై ప్రశంసల వర్షం
‘రవీంద్ర జడేజా విలువ ఎంతనేది అందరికీ తెలిసిందే. కానీ అశ్విన్ ఈ సిరీస్‌లో ఎంతగానో రాణించాడు. తన జట్టు కోసం ఏం చేయడానికి అయినా తను సిద్ధం. తను అది చేస్తున్నాడు కూడా. జడేజాకు గాయం అయింది. కానీ అశ్విన్ అవకాశం రాగానే తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.’ అంటూ అశ్విన్‌ను విరాట్ ఆకాశానికి ఎత్తేశాడు.


‘పుజారా, రహానే అనుభవం వెలకట్టలేనిది. వారు ఆస్ట్రేలియాలో ఎంత బాగా ఆడారో మనం గతంలోనే చూశాం.’ అన్నాడు. ఈ సిరీస్‌కు వచ్చేటప్పుడు పుజారా, రహానే ఇద్దరి ఫాం పెద్దగా బాగాలేదు. అయితే రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ అర్థసెంచరీలు సాధించి భారత్ మరీ తక్కువ స్కోరుకు ఆలౌట్ కాకుండా ఆపారు.