కేప్‌టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను కూడా 2-1తో సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై మొదటి టెస్టు సిరీస్ గెలవాలన్న భారత్ ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. భారత్ మొదటి టెస్టులో విజయం సాధించగా.. మిగతా రెండు టెస్టులూ దక్షిణాఫ్రికా సొంతం అయ్యాయి.


212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆడుతూ పాడుతూ మ్యాచ్ గెలిచేసింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు. బుమ్రా, షమి, శార్దూల్ ఠాకూర్‌లకు తలో వికెట్ దక్కింది. కీగన్ పీటర్సన్ (82: 113 బంతుల్లో, 10 ఫోర్లు), వాన్ డర్ డసెన్ (41 నాటౌట్: 95 బంతుల్లో, మూడు ఫోర్లు), టెంపా బవుమా (32 నాటౌట్: 58 బంతుల్లో, ఐదు ఫోర్లు), డీన్ ఎల్గర్ (30: 96 బంతుల్లో, మూడు ఫోర్లు) రాణించారు.


మొదటి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం సాధించినప్పటికీ భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో పంత్, కోహ్లీ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ దారుణంగా విఫలం అయ్యారు. అలాగే నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దీంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.