దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కేప్‌టౌన్ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల లక్ష్యం నిలిచింది. రిషబ్ పంత్ (100 నాటౌట్: ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్‌లో తనే టాప్ స్కోరర్. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు తీయగా.. కగిసో రబడ, లుంగి ఎంగిడి మూడేసి వికెట్లు తీశారు.


13 పరుగుల స్వల్ప ఆధిక్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆరు ఓవర్లలోనే ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (7: 15 బంతుల్లో, ఒక ఫోర్), కేఎల్ రాహుల్ (10: 22 బంతుల్లో, రెండు ఫోర్లు) అవుటయ్యారు. ఆ తర్వాత పుజారా, కోహ్లీ కలిసి మరో వికెట్ పడకుండా రెండో రోజును ముగించారు.


మూడో రోజు ఆట ప్రారంభం కాగానే.. మొదటి రెండు ఓవర్లలో చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే అవుటయ్యారు. ఈ దశలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 94 పరుగులు జోడించిన అనంతరం విరాట్ కోహ్లీని అవుట్ చేసి లుంగి ఎంగిడి భారత్‌ను గట్టి దెబ్బ కొట్టాడు.


ఒకవైపు రిషబ్ పంత్ నిలకడగా ఆడుతున్నా.. మరో ఎండ్‌లో సహకారం అందించేవారు కరువయ్యారు. తొమ్మిది వికెట్లు పడ్డాక రిషబ్ పంత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా కూడా అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెర పడింది.