భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు హోరాహోరీగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (14 బ్యాటింగ్: 39 బంతుల్లో, రెండు ఫోర్లు), చతేశ్వర్ పుజారా (9 బ్యాటింగ్: 31 బంతుల్లో, రెండు ఫోర్లు) క్రీజులో ఉన్నారు. భారత్ మొత్తంగా 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ, జాన్సెన్‌లకు చెరో వికెట్ పోతుంది.


రెండో రోజు చివరి సెషన్‌లో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఆరు ఓవర్లలోనే కీలకమైన ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10: 22 బంతుల్లో, రెండు ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (7: 15 బంతుల్లో, ఒక ఫోర్) ఇద్దరూ అవుటయ్యారు. అయితే ఆ తర్వాత విరాట్ కోహ్లీ, పుజారా మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.


అంతకుముందు దక్షిణాఫ్రికా 210 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లో కీగన్ పీటర్సన్ (70) ఒక్కడే పోరాడాడు. భారత బౌలర్లలో బుమ్రాకు ఐదు వికెట్లు దక్కాయి.