టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా వంద క్యాచుల రికార్డు అందుకున్నాడు. మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ, సయ్యద్‌ కిర్మాణి, కిరణ్‌ మోరె వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. వాండరర్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో అతడీ ఘనత సాధించాడు.






కేవలం 24 ఏళ్ల వయసులోనే పంత్‌ ఈ రికార్డు అందుకోవడం ప్రత్యేకం. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్‌ బౌలింగ్‌లో సఫారీ ఆటగాడు లుంగి ఎంగిడి క్యాచ్‌ అందుకోవడంతో ఈ మైలురాయికి చేరుకున్నాడు. మొత్తంగా టీమ్‌ఇండియా తరఫున టెస్టు క్రికెట్లో వంద క్యాచులు అందుకున్న నాలుగో వికెట్‌ కీపర్‌గా పంత్‌ చరిత్ర సృష్టించాడు. ఎంఎస్ ధోనీ (256), సయ్యద్‌ కిర్మాణి (160), కిరణ్‌ మోరె (110) సరసన నిలిచాడు. ఇక అంతర్జాతీయంగా ఈ ఘనత అందుకున్న 42వ వికెట్‌కీపర్‌గానూ తన పేరు లిఖించాడు.


వంద క్యాచుల ఘనత అందుకోవడానికి రిషభ్ పంత్‌ 26 టెస్టులు, 50 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఎంఎస్ ధోనీ, వృద్ధిమాన్‌ సాహా 36 టెస్టుల్లో ఈ రికార్డు సాధించారు. మరోవైపు రెండో టెస్టులో యువ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ దక్షిణాఫ్రికాలో ఏడు వికెట్ల ఘనత అందుకున్న తొలి బౌలర్గా అవతరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు.






రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం, రెండోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండు వికెట్ల నష్టానికి  85 పరుగులు చేసింది. 58 పరుగుల ఆధిక్యంలో ఉంది. అజింక్య రహానే (11 బ్యాటింగ్: 22 బంతుల్లో, ఒక ఫోర్), చెతేశ్వర్ పుజారా (35 బ్యాటింగ్: 42 బంతుల్లో, ఏడు ఫోర్లు) క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా 229 పరుగులు చేయగలిగింది. దీంతో ఆతిథ్య జట్టుకు 27 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 200+ పరుగులు చేస్తే టీమ్‌ఇండియాకు గెలుపు అవకాశాలు ఉంటాయి.