Ind vs SA, 2nd Test, KL Rahul: టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ మరోసారి అభిమానులు, క్రికెటర్ల మనసులు గెలిచాడు. వాండరర్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ప్రత్యర్థి బౌలర్‌కు క్షమాపణలు చెప్పాడు. కాగిసో రబాడాకు అతడు సారీ చెబుతున్న మాటలు స్టంప్‌ మైక్‌లో వినిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.


తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 202 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (50: 133 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (46: 50 బంతుల్లో, 6x4) అత్యంత విలువైన పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (11 బ్యాటింగ్: 57 బంతుల్లో, ఒక ఫోర్), కీగన్ పీటర్సన్ (14 బ్యాటింగ్: 39 బంతుల్లో, రెండు ఫోర్లు) బ్యాటింగ్‌ చేస్తున్నారు.


తొలిరోజు భారత ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ను కాగిసో రబాడా వేశాడు. అతడు మూడో బంతిని విసురుతుండగా కేఎల్‌ రాహుల్‌ వికెట్ల నుంచి పక్కకు జరిగాడు. బంతి ఆడేందుకు అతడింకా సిద్ధం కాకపోవడమే ఇందుకు కారణం. అయితే ఆ సమయంలో రబాడా దాదాపుగా బంతి విడిచిపెట్టే స్థితిలో ఉన్నాడు. దాంతో కాస్త త్వరగా బంతి ఆడేందుకు సిద్ధమవ్వాలని మైదానంలోని అంపైర్‌ మరాయిస్‌ ఎరాస్మస్‌ మందలించాడు. 'కేఎల్‌ దయచేసి కాస్త వేగంగా ఆడేందుకు ప్రయత్నించు' అని అన్నాడు. దాంతో రబాడాకు రాహుల్‌ వెంటనే సారీ చెప్పాడు.






అంతర్జాతీయ క్రికెట్లో కేఎల్‌ రాహుల్‌ అత్యంత వేగంగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం షాట్ల ఎంపికలో గందరగోళానికి గురైన అతడు జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఆ తర్వాత తన మనస్తత్వాన్ని మార్చుకొని నియంత్రణ సాధించాడు. మైదానంలో పరుగులు వరద పారిస్తున్నాడు. తాజాగా టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రోహిత్‌ గాయంతో దూరమవ్వడంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీసుకు సారథ్యం వహించనున్నాడు. కోహ్లీ వెన్నునొప్పితో బాధపడుతుండటంతో రెండో టెస్టులో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించాడు.