Cheteshwar Pujara mind games: వాండరర్స్‌లో జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. రెండు జట్లకు విజయావకాశాలు ఉండటంతో ఆసక్తి నెలకొంది. ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుందోనని అభిమానులు ఉత్కంఠతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా సీనియర్ క్రికెటర్ చెతేశ్వర్ పుజారా మైండ్‌గేమ్‌కు తెరతీశాడు. మూడో రోజుకే పిచ్ పూర్తిగా క్షీణించిందని అంటున్నాడు. నిర్జీవంగా మారిన వికెట్‌పై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేయడం కష్టమని ప్రత్యర్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు.
టీమ్‌ఇండియా రెండో టెస్టులో 266 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లోటును మినహాయిస్తే ప్రత్యర్థికి 240 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి రెండు రోజుల్లో 122 పరుగులే అవసరం. భారత్ గెలవాలంటే మాత్రం ఇంకా ఎనిమిది వికెట్లు తీయాలి. సమీకరణాలు సఫారీ జట్టుకే అనుకూలంగా అనిపిస్తున్నప్పటికీ.. పిచ్ క్షీణించడంతో ఆ జట్టు గెలుపు అంత ఈజీ కాదని పుజారా అంటున్నాడు.
'ఒక బ్యాట్స్‌మన్‌కు పరుగులు చేయడం అత్యంత కీలకం. ముఖ్యంగా భారీ స్కోర్లు చేసేందుకు వీలవ్వని కఠిన వికెట్లపై పరుగులు అవసరం. పరిస్థితులు కఠినంగా ఉన్నా మేం పరుగులు చేశాం. విజయావకాశాలు ఇద్దరికీ సమంగా ఉన్నాయి. మేం మరిన్ని వికెట్లు తీయనప్పటికీ.. క్షీణించిన పిచ్‌పై మా బౌలర్లు నాలుగో రోజు వికెట్లు తీయగలరన్న విశ్వాసం ఉంది' అని పుజారా మీడియాతో చెప్పాడు.
సఫారీ ఆటగాళ్లు డీన్ ఎల్గర్, పీటర్సన్ బ్యాటింగ్ చేస్తున్న విధానాన్ని పుజారా అభినందించాడు. ఆత్మవిశ్వాసంతో పరుగులు చేస్తున్నారని అన్నాడు. ఎల్గర్ బ్యాటింగ్ చూస్తుంటే అతడు స్లిప్‌లో క్యాచ్ ఇచ్చేలా కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు. అతడి టెక్నిక్, టెంపర్‌మెంట్ భిన్నంగా ఉన్నాయని, కొన్ని సార్లు ఆశ్యర్యం కలిగిస్తుందని వెల్లడించాడు. అతడు పరుగులు చేస్తున్నా త్వరగానే ఔట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.