భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ దక్షిణాఫ్రికాను గట్టిదెబ్బ కొట్టాడు. రెండో రోజు లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ఒక దశలో వికెట్ నష్టానికి 88 పరుగులతో మెరుగ్గా కనిపించిన దక్షిణాఫ్రికా.. శార్దూల్ ఆరు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు తీయడంతో కష్టాల్లో పడింది.


35-1 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చక్కగా ప్రారంభం అయింది. కీగన్ పీటర్సన్ (62: 118 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) వేగంగా ఆడగా.. డీన్ ఎల్గర్ (28: 120 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మరో ఎండ్‌లో జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ వికెట్ పడకుండా 20 ఓవర్ల పాటు ఆడారు.


అయితే శార్దూల్ బౌలింగ్‌కు వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. రెండో రోజు ఆటలో తను బౌల్ చేసిన మొదటి ఓవర్లోనే వికెట్ తీసిన శార్దూల్.. మూడు, నాలుగు ఓవర్లలో కూడా ఒక్కో వికెట్ తీశాడు. క్రీజులో నిలదొక్కుకున్న డీన్ ఎల్గర్, కీగన్ పీటర్సన్‌లతో పాటు ప్రమాదకారి వాన్ డర్ డసెన్‌ను (1: 17 బంతుల్లో) కూడా అవుట్ చేశాడు. ప్రస్తుతం టెంపా బవుమా (0 బ్యాటింగ్: 2 బంతుల్లో) క్రీజులో ఉన్నాడు.


మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా ఈ స్కోరును సమం చేయడానికి మరో 100 పరుగులు చేయాలి. అయితే తర్వాత వచ్చే బ్యాటర్లు జాగ్రత్తగా ఆడితేనే దక్షిణాఫ్రికాకు ఇది సాధ్యం అవుతుంది.