IND vs NZ: టీ20 ప్రపంచ కప్ 2022 ముగిసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో  మూడు సిరీస్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ మూడు సిరీస్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా బ్యాట్, బాల్ రెండింటితోనూ అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా జట్టు విజయానికి దోహదపడ్డాడు.


న్యూజిలాండ్‌తో ముగిసిన సిరీస్‌లో హార్దిక్‌ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ టైటిల్ లభించింది. ఈ సిరీస్‌లో హార్దిక్ బ్యాట్‌తో 66 పరుగులు చేయగా, బంతితో మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా పేరు మీద మరో రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్‌లో నాలుగు వేల కంటే ఎక్కువ పరుగులు, 100 వికెట్లకు పైగా సాధించిన మొదటి భారతీయ ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు.


ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో చోటు సంపాదించిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో తనను తాను కెప్టెన్‌గా నిరూపించుకున్న హార్దిక్ పాండ్యా, మొదటి IPL సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపాడు.


2013లో తొలి టీ20 మ్యాచ్‌
2013లో అహ్మదాబాద్ మైదానంలో ముంబైతో హార్దిక్ తన కెరీర్‌లో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుండి అతను ఈ ఫార్మాట్‌లో మొత్తం 223 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో హార్దిక్ 29.42 సగటుతో 4002 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా ఈ ఫార్మాట్‌లో 15 హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లు కలిగి ఉండగా, అతని అత్యధిక స్కోరు 91 పరుగులుగా ఉంది.


మరోవైపు హార్దిక్ పాండ్యా బౌలింగ్ గురించి మాట్లాడాలంటే టీ20 ఫార్మాట్‌లో అతను ఇప్పటివరకు 27.27 సగటుతో మొత్తం 145 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో అతను ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు సాధించిన ఘనతను మూడు సార్లు సాధించాడు.


హార్దిక్ పాండ్యా బోల్డ్ కామెంట్స్ చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటాడు. ఇటీవలే ఒకసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 'నా జీవితం, ఇంకా కెప్టెన్సీ గురించి నాకు  ఒక సాధారణ నియమం ఉంది. నేను నా నిర్ణయాలు సొంతంగా తీసుకుంటాను. ఓటమి పాలైనా దానికి నేనే బాధ్యత వహిస్తాను. నేను బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడతాను. ఐపీఎల్ 2022 ఫైనల్ ద్వారా ఒత్తిడిలో ఆడడం అలవాటు చేసుకున్నాను. అలాగే దాన్ని అంతర్జాతీయ వేదికలపై కూడా చేయగలమని ఆశిస్తున్నాను' అని స్పష్టంచేశాడు.


అలాగే తన ప్రదర్శన గురించి మాట్లాడాడు. 'నిజం చెప్పాలంటే నా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు క్రెడిట్ సహాయ సిబ్బందికి దక్కుతుంది. నేను పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ సమయంలో ఏది అవసరమో అది చేస్తాను. ఎక్కువగా నాపై నేను నమ్మకంతో ఉంటాను' అని పాండ్యా అన్నాడు. 


జట్టులో ఉన్న ఆటగాళ్లపై ప్రశంసలు కూడా కురిపిస్తాడు. 'సూర్య లాంటి వాళ్లు జట్టులో ఉంటే కెప్టెన్ పని తేలికవుతుంది. సూర్యకుమార్ లాంటి వాళ్లు మన జట్టులో ఉండడం చాలా ముఖ్యం అని నేను ఎప్పుడూ చెప్పేది ఇందుకే. అతను ఆటతీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అతను ఎప్పుడూ ఒకే మాట చెప్తుంటాడు. బ్యాటింగ్ తేలికగా ఉంది అని. నేనే కనుక ప్రత్యర్థి బౌలర్ ని అయితే సూర్య బ్యాటింగ్ కు బాధపడేవాణ్ని. అతను షాట్లు ఆడే విధానం బౌలర్ ను విచ్ఛిన్నం  చేస్తుంది.' అని సూర్యకుమార్ యాదవ్‌పై పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు.