ఒక్క రోజే ఇన్ని నాటకీయ పరిణామాలా..! ముంబయి టెస్టు శనివారం అనేక మలుపులు తిరిగింది. ఆధిపత్యం రెండు జట్లతో దోబూచులాడింది. కాసేపు న్యూజిలాండ్ పైచేయి సాధిస్తే మరికాసేపు టీమ్‌ఇండియా అదరగొట్టింది. మొదట కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి చరిత్ర సృష్టిస్తే.. వెంటనే పుంజుకొన్న కోహ్లీసేన ప్రత్యర్థిని 62కే ఆలౌట్ చేసి భారీ దెబ్బకొట్టింది.
పుజారా ఓపెనింగ్
కివీస్ త్వరగా ఆలౌట్ కావడంతో వారిని ఫాలోఆన్ ఆడిస్తారని అంతా అనుకున్నారు! కానీ 263 పరుగుల ఆధిక్యంతో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి షాకిచ్చింది! యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గాయపడటంతో చెతేశ్వర్ పుజారా (29 బ్యాటింగ్; 51 బంతుల్లో 3x4, 1x6) ఓపెనింగ్ చేశాడు. మయాంక్ అగర్వాల్ (38 బ్యాటింగ్; 75 బంతుల్లో 6x4)తో కలిసి వేగంగా ఆడాడు. చక్కని స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం అందించారు. 21 ఓవర్లకు వెలుతురు లేమితో ఆటను ముగించడంతో టీమ్‌ఇండియా 332 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
వణికించిన బౌలర్లు
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను టీమ్‌ఇండియా బౌలర్లు వణికించారు. 31 పరుగులకే 5 వికెట్లు పడగొట్టారు. యువ పేసర్ మహ్మద్ సిరాజ్ కివీస్ బ్యాటర్ల వెన్ను విరిచాడు. జట్టు స్కోరు 10 వద్ద విల్ యంగ్ (4)ను పెవిలియన్ పంపించాడు. మరో 5 పరుగులకే టామ్ లేథమ్ (10)ని ఔట్ చేశాడు. అదే ఊపులో జట్టు స్కోరు 17 వద్ద సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (1)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అతడికి తోడుగా డరైల్ మిచెల్ (8)ని అక్షర్ పటేల్, హెన్రీ నికోల్స్ (7)ను అశ్విన్ ఔట్ చేయడంతో 14 ఓవర్లకు కివీస్ 31/5తో నిలిచింది. ఆ తర్వాత అశ్విన్ మరింత చెలరేగి టామ్ బ్లండెల్ (7), టిమ్ సౌథీ (0), విలియమ్ సోమర్ విలె (0)ను ఔట్ చేశాడు. దాంతో 28.1 ఓవర్లు ఆడిన కివీస్ 62కే ఆలౌటైంది.
పటేల్ 10 వికెట్ల ఘనత
అంతకు ముందు మయాంక్ అగర్వాల్ (150; 311 బంతుల్లో 17x4, 4x6) అదరగొట్టాడు. ఓవర్‌నైట్ స్కోరు 221/4తో బ్యాటింగ్ ఆరంభించిన టీమ్‌ఇండియాకు భారీ స్కోరు అందించాడు. అతడికి అక్షర్ పటేల్ (52; 128 బంతుల్లో 5x4, 1x6) తోడుగా నిలిచాడు. కానీ కివీస్ హీరో అజాజ్ పటేల్ మళ్లీ చెలరేగాడు. ఓకే ఓవర్లో వరుస బంతుల్లో జట్టు స్కోరు 224 వద్ద రెండు వికెట్లు తీశాడు. 71.4వ బంతికి నైట్ వాచ్‌మన్ వృద్ధిమాన్ సాహా (27; 62 బంతుల్లో 3x4, 1x6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాతి బంతికి క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి షాకిచ్చాడు. అక్కడి నుంచి అక్షర్ పటేల్‌తో కలిసి మయాంక్ నిలకడగా ఆడాడు. స్పిన్‌ను చక్కగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరినీ ఔట్ చేసిన అజాజ్ పటేల్ మరింత చెలరేగి మిగిలిన వికెట్లనూ పడగొట్టి పది వికెట్ల ఘనత అందుకున్నాడు. టీమ్‌ఇండియా 325కు పరిమితం అయింది.