IND vs ENG, 1st Innings Highlights: ఎడ్జ్‌బాస్టన్‌లో టీమ్‌ఇండియా దాదాపుగా 'ఎడ్జ్‌' సాధించింది. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 84.5 ఓవర్లకు 416కు ఆలౌటైంది. 98కే 5 వికెట్లు చేజార్చుకున్న భారత్‌ను రిషభ్ పంత్‌ (146; 111 బంతుల్లో 20x4, 4x6), రవీంద్ర జడేజా (104; 194 బంతుల్లో 13x4) అద్వితీయమైన సెంచరీలతో ఆదుకున్నారు. ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం సాధించగల స్కోరును అందించారు.


రెండో రోజైన శనివారం ఓవర్‌నైట్‌ స్కోరు 338/7తో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. కేవలం 11.5 ఓవర్లు మాత్రమే ఆడింది. అయితేనేం! 78 పరుగులు సాధించింది. వ్యక్తిగత స్కోరు 83తో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా చక్కని కవర్‌డ్రైవ్‌లతో అలరించాడు. మ్యాటీ పాట్స్‌ వేసిన 78.5వ బంతికి లభించిన జీవనదానాన్ని ఉపయోగించుకున్నాడు. అదే ఓవర్లో ఆఖరి రెండు బంతుల్ని బౌండరీకి పంపించి టెస్టుల్లో మూడో సెంచరీ అందుకున్నాడు. మొత్తంగా 183 బంతుల్లో 13 ఫోర్లతో ఈ ఘనత సాధించాడు. అయితే అండర్సన్‌ వేసిన 82.2వ బంతికి అతడు ఔటయ్యాడు. అంతకు ముందే షమీ ఔటవ్వడంతో భారత్‌ 375/9తో నిలిచింది.


Also Read: జస్ట్‌ 6.14 నిమిషాల్లో రిషభ్‌ పంత్‌ ఊచకోత - వైరల్‌ వీడియో!


Also Read: ఎడ్జ్‌బాస్టన్‌లో 'రాక్‌స్టార్‌'! వరుస బౌండరీలతో జడ్డూ సెంచరీ


జట్టు స్కోరు 400 దాటితే బాగుండూ అనుకుంటున్న తరుణంలో కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా (31*; 16 బంతుల్లో 4x4, 2x6) స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 84వ ఓవర్లో ఏకంగా 35 రన్స్‌ కొట్టి సర్‌ప్రైజ్‌ చేశాడు. వరుసగా 4 Wd5 N6 4 4 4 6 1తో దుమ్మురేపాడు. అండర్సన్‌ వేసిన 84.5వ బంతికి సిరాజ్‌ (2) ఔటవ్వడంతో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. జిమ్మీ ఆరోసారి టీమ్‌ఇండియాపై 5 వికెట్ల ఘనత అందుకున్నాడు.