Prakash Raj On Modi :  హైదరాబాద్‌కు వస్తున్న ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ నేతలు అభివృద్ది అంటే ఏంటో చూసి నేర్చుకోవాలని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా సలహా ఇచ్చారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో బీజేపీ విధానాలపై విరుచుకుపడుతూ పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా ఉండే ప్రకాష్ రాజ్ ఇటీవలి కాలంలో కాస్త సైలెంట్‌గా ఉన్నారు. అయితే హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన మరో సారి సెటైరిక్ ట్వీట్‌తో తెర ముందుకు వచ్చారు.  


 హైదరాబాద్‌కు వస్తున్న సుప్రీంలీడర్‌కు స్వాగతం..   బీజేపీ పాలిత స్టేట్స్‌లో ప్రజలు కట్టిన పన్నుల మొత్తంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లపై గుంతలు పూడుస్తూంటారు.  తెలంగాణలో మాత్రం ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తారని పేర్కొన్నారు. ఈ పర్యటనను ఆస్వాదించాలని, దూరదృష్టితో మౌలిక సదుపాయాలు ఎలా అందించాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఫొటోతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, టీ హబ్, ప్రభుత్వ ఆసుపత్రి, గురుకుల పాఠశాల భవనాలతో కూడిన ఫొటోలను షేర్‌ చేశారు. 



ఇటీవల కర్ణాటకలో మోదీ పర్యటించారు. ఆ సమయంలో కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు వేశారు. మోదీ పర్యటన అయిపోయిన తర్వాత వర్షాలు పడ్డాయి. ఈ వర్షాల కారణంగా ఈ రోడ్లన్నీ పాడైపోయారు. అక్కడి న్యాయస్థానం కూడా ఈ అంశంపై విస్మయం వ్యకం చేసింది. దీన్నే ప్రకాష్ రాజ్ పరోక్షంగా ప్రస్తావించారు. 


కొంత కాలంగా టీఆర్ఎస్‌తో ప్రకాష్ రాజ్ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బీజేపీకి పోటీగా టీఆర్ఎస్.. తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూపించాలని డిసైడయింది. ఆ పార్టీ నేతలందరూ ఇలాంటి ట్వీట్లే చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కూడా తెలంగాణ అభివృద్ధిని ప్రమోట్ చేస్తూ ట్వీట్ చేశారు.