What BJP Poll Plan In Telangana : భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అట్టహాసంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణ మొత్తం జాతీయనేతలతో పర్యటనలు చేయిస్తోంది. ఎన్నికలకు బీజేపీ సిద్ధం కావడం ఇలాగే ఉంటుంది. అయితే ఇది డైరక్ట్ పాలిటిక్స్. ఇన్‌డైరక్ట్ పాలిటిక్స్ కూడా బీజేపీకి కీలకం. మహారాష్ట్రలో జరిగినట్లుగా ఇన్‌డైరక్ట్ర పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. తెలంగాణ విషయంలోనూ అలాంటి ప్లాన్లు బీజేపీకి ఉన్నాయా ? పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతల్ని బీజేపీలో చేర్చుకునే వ్యూహాలు ఉన్నాయా ?
టీఆర్ఎస్‌లో చాపకింద నీరులా అసంతృప్తి ఉందా !?
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. టీఆర్ఎస్‌లో ఆశావహులు పెరిగిపోయారు. సిట్టింగ్‌లపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. రెండు టర్మ్‌లు వారికి ఎమ్మెల్యేలుగా ప్రజలు గెలిపించారు. వారి వ్యవహారాలతో ప్రజల్లో వ్యతిరేకత సహజం. అందుకే ఈ సారి యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడం లేదని టీఆర్ఎస్ పెద్దలు హింట్ ఇస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో గెలుస్తారు అని తెలిస్తేనే టిక్కెట్ ఇస్తామని లేకపోతే లేదని తేల్చి చెబుతున్నారు. అందుకే ఎక్కువ మంది పక్క చూపులు చూస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి ఇలాంటి అసంతృప్తులను పట్టుకోవడంలో సాటిలేని నైపుణ్యం ఉంది. ఆ పార్టీ ఇప్పటికే చాప కింద నీరులా వర్కవుట్ చే చేసే ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. బీజేపీ వర్గాలు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెబుతూ వస్తున్నాయి. చాలా మంది అంటే ఎంత మంది అనేది వాళ్లకీ తెలియదు కానీ... ఎంత మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది.. ఎంత మంది బీజేపీ ఆకర్ష్‌కు పడిపోతారో చెప్పలేమని అంటున్నారు.
మహారాష్ట్రలా ప్రభుత్వాన్ని మార్చే ఆలోచన చేసే చాన్స్ లేదు.. !
మహారాష్ట్రలోలా అత్యధిక మంది ఎమ్మెల్యేల్ని ఆకర్షించి... ప్రభుత్వాన్ని మార్చే పని బీజేపీ చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. ఎమ్మెల్యేల్ని ఆకర్షించినా కూడా ప్రభుత్వం కూల్చడం లేదా .. మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ సాధించేది ఏమీ లేదు. అలా చేసినా ఎంతో సమయం కూడా లేదు. అలా చేయడం రాజకీయంగా ఆత్మహత్యా సదృశం అవుతుంది. అందుకే ప్రభుత్వాన్ని మార్చే సాహసం చేయకపోవచ్చు కానీ.. పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంది. అంటే వరుసగా పార్టీ ముఖ్య నేతల్ని చేర్చుకునే అవకాశం ఉంది. బెంగాల్‌లో ఇదే వ్యూహం అమలు చేశారు.
బెంగాల్‌లో ఎన్నికల ఏడాది మొత్తం చేరికలే !
జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వతా బెంగాల్ తరహా వ్యుూహం తెలంగాణలో బీజేపీ అమలు చేయవచ్చు. అక్కడ ఎన్నికల ఏడాదిలో టీఎంసీ నేతల్ని ఒక్కొక్కరుగా పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించారు. ఎన్నికల ముందు నాటికి టీఎంసీ నుంచి వచ్చిన సువేందు అధికారినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి రంగంలోకి దిగారు. ఎన్నికల ఏడాది మొత్తం తృణమూల్ టెన్షన్‌కు గురవుతూనే ఉంది. ఆత్మీయులంతా పార్టీకి గుడ్ బై చెబుతూనే ున్నారు. ఇక్కడ కూడా ఎన్నికలు ఏడాది ఉంటాయనగా బీజేపీ వర్గాలు రంగంలోకి అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ వ్యూహం అమలు చేస్తుందని అనుకోవచ్చు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు పని ప్రారంభిస్తాయా ?
బీజేపీ రాజకీయం లో ఎవరు ఔనన్నా.. కాదన్నా కేంద్ర దర్యాప్తు సంస్థలది కీలక పాత్ర ఉంటుంది. తాము రాజకీయంగా బలపడాలనుకున్న చోట్ల ఈ సంస్థలు దూకుడు చూపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పటి వరకూ తెలంగాణలో ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. బీజేపీ యాక్షన్ ప్లాన్ ప్రారంభమైన తర్వాత వాటి హడావుడి పెరగొచ్చంటున్నారు. మొత్తంగా బీజేపీకి తెలంగాణ విషయంలో అధికారం కోసం ఏమీ చేయకుండా ఎన్నికలకు వెళ్తారని అనకోలేం. ఏదో ఒకటి చేస్తారు. అదేమిటన్నది ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాలను చూస్తే ఓ సారి క్లారిటీకి వచ్చేయవచ్చు.