భారత్ X ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ ఎంత ఆసక్తికరంగా సాగుతుందో... ఈ టెస్టు సిరీస్‌లో మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంటుంది. అదేంటంటే... జార్వో అనే అభిమాని తరచుగా మైదానంలోకి రావడం. ఔను, ఇప్పటి వరకు జార్వో మూడు సార్లు మ్యాచ్ జరుగుతుంటే... అర్థంతరంగా మైదానంలోకి వచ్చాడు. దీంతో అభిమానులు ఇంగ్లాండ్ భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 






అసలేం జరిగిందంటే... భారత్, ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన జార్వో ఎంత పాపులర్‌ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లార్డ్స్‌, లీడ్స్‌‌లో జరిగిన టెస్టుల్లో మైదానంలోకి దూసుకొచ్చి ఆటకు అంతరాయం కలింగించాడు. ఇప్పుడు తాజాగా ఓవల్ మైదానంలోకి మరోసారి దూసుకొచ్చాడు. ఈ సారి జార్వో బౌలర్‌ అవతారం ఎత్తాడు. ఇంగ్లాండ్ ప్లేయర్‌కి బౌలింగ్ వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 34వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమేశ్‌ యాదవ్‌ 34వ ఓవర్లో రెండు బంతులు వేసి మూడో బంతికి సిద్ధమౌతున్నాడు. ఇంతలో జార్వో మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బెయిర్‌ స్టోను తగులుతూ బంతిని విసిరినట్లుగా యాక్షన్‌ చేశాడు. 






ఇంతలో మైదానం సిబ్బంది వచ్చి జార్వోని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. జార్వో చర్యతో టీమిండియా ఆటగాళ్లతో పాటు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ మొదట షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకుని నవ్వుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లీడ్స్‌ టెస్టు అనంతరం ఆ స్టేడియం నిర్వాహకులు జార్వోపై జీవతకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.  అయినా జార్వో మరోసారి అదే తరహాలో చేయడంతో ఈసారి ఏకంగా ఈసీబీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. కాగా జార్వోపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 


జార్వో తీరుపై నెట్టింట్లో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి, రెండు సార్లు వచ్చాడంటే పర్వాలేదు... ఇలా మరోసారి రావడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. బయో బబుల్ ఆటగాళ్లకేనా, ఇంగ్లాండ్ భద్రతా సిబ్బంది ఏం చేస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.