భారత్ X ఇంగ్లాండ్ మూడో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ 139 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
అంతకుముందు... రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 423/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ 15 నిమిషాలకే టెయిలెండర్ల వికెట్లు కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 432 పరుగుల వద్ద తెరపడింది. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 78 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటై ఉండటంతో.. ఇంగ్లాండ్‌కి 354 పరుగుల ఆధిక్యం లభించింది.
మూడో రోజు భారత్‌దే:
మూడో రోజు ఆట ఏకపక్షంగా సాగింది. మొత్తం భారత్‌కు అనుకూలంగా మారింది. దీంతో భారత బ్యాట్స్‌మెన్లు జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును కదిలించారు. ఓపెనర్ రోహిత్ శర్మ (59, 156 బంతుల్లో) పుజరా (91 నాటౌట్, 180 బంతుల్లో), కెప్టెన్ విరాట్ కోహ్లీ (45 నాటౌట్, 94 బంతుల్లో) మెరుగైన ప్రదర్శనతో మంచి ఇన్నింగ్స్‌లు దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్ ఆధిక్యం 139 పరుగులకు తగ్గింది. కోహ్లీ అర్ధ శతకానికి, పుజరా శతకానికి చేరువలో ఉన్నారు. మరి, పిచ్ నాలుగో రోజు ఎవరికి సహకరిస్తుందో చూడాలి.
నిరాశపరిచిన కేఎల్ రాహుల్
మూడో టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ పూర్తిగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే ఓవర్టన్ బౌలింగ్లో బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జార్వో
జార్వో ఎవరు? టీమిండియాలో ఈ పేరు ఎప్పుడూ వినలేదు అనుకుంటున్నారా? ఔను... నిజమే అతడు టీమిండియా సభ్యుడు కాదు. కానీ, ఈ రోజు మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఔటవ్వగానే కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేశాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడ్ని మైదానం బయటికి తీసుకువచ్చారు. జార్వో ఇంగ్లాండ్ దేశస్థుడు. మ్యాచ్ చూడటానికి వచ్చి మధ్యలో ఇలా భారత బ్యాట్స్‌మెన్‌లా మైదానంలోకి వచ్చేశాడు.
మీకు గుర్తుందా? లార్డ్స్ టెస్టులో కూడా జార్వో ఫీల్డింగ్ చేయడానికి ఇలాగే వస్తే మైదానం సిబ్బంది అతడ్ని బయటికి పంపించారు. ఈ రోజు జార్వోని మైదానంలో చూసిన అభిమానులు... లక్కీ ఛార్మ్, భారత్‌కు లక్కీ ఛార్మ్ అని కామెంట్లు పెడుతున్నారు. రెండో టెస్టులో ఇలాగే మ్యాచ్ మధ్యలో వచ్చాడు. మూడో టెస్టులో కూడా వచ్చాడు... అంటే భారత్ ఈ టెస్టులో విజయం సాధించవచ్చు అని కామెంట్ చేస్తున్నారు.