Rohit Sharma Shikhar Dhawan 5000 Runs opening partnership record: టీమ్‌ఇండియా ఓపెనింగ్‌ జోడీ రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు సృష్టించింది. వన్డే క్రికెట్లో 5000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన భారత రెండో జంటగా ఘనత అందుకుంది. దిగ్గజ ద్వయం సచిన్‌ తెందూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ తర్వాతి స్థానంలో నిలిచింది. 


సచిన్‌, గంగూలీ కలిసి 1996- 2007 మధ్య 136 వన్డే ఇన్సింగ్సుల్లోనే 6,609 పరుగులు చేశారు. ప్రపంచ క్రికెట్లో ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం గమనార్హం. వీరిద్దరూ 49.32 సగటుతో రాణించారు. 21 సెంచరీలు, 23 హాఫ్‌ సెంచరీలు అందుకున్నారు. ఒక ఇన్నింగ్సులో అత్యధిక భాగస్వామ్యం 258. ఇక గబ్బర్‌, హిట్‌మ్యాన్‌ కలిసి 2013-ఇప్పటి వరకు 5108 పరుగులు సాధించారు. ఇందుకోసం 112 ఇన్నింగ్సులు తీసుకున్నారు. 46.43 సగటుతో 18 సెంచరీలు, 15 హాఫ్‌ సెంచరీలు కొట్టేశారు. 


అంతర్జాతీయ క్రికెట్లో 5000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం అంత సులభమేమీ కాదు. ఇందుకు ఎంతో శ్రమించాలి. ఇద్దరూ ఫామ్‌లో ఉండాలి. ఒకర్నొకరు అర్థం చేసుకోవాలి. తన పాట్నర్‌ ఆటపై అవగాహన ఉండాలి. అప్పుడే ఔటవ్వకుండా, పొరపాట్లకు తావులేకుండా పరుగులు చేయగలరు. రోహిత్‌, ధావన్‌ మధ్య ఈ అండర్‌స్టాండింగ్‌ బాగుంది. టీ20 క్రికెట్లోనూ వీరిద్దరూ కలిసి చాలా పరుగులు చేశారు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఓపెనింగ్‌ జోడీగా ప్రత్యర్థులు వీరిని భావిస్తారు. ఇక ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో వీరిద్దరూ కలిసి 111 పరుగులు అజేయ భాగస్వామ్యం అందించారు.




IND vs ENG, 1st ODI, The Oval Stadium: గెలుపంటే ఇదీ! అన్నట్టుగా చెలరేగింది టీమ్‌ఇండియా. ఆంగ్లేయులకు తమ సొంతగడ్డపైనే కనీవినీ ఎరగని పరాభవం రుచిచూపించింది. మొదట జస్ప్రీత్‌ బుమ్రా (6/19), మహ్మద్‌ షమి (3/31)  దెబ్బకు ఇంగ్లాండ్‌ కేవలం 25.2 ఓవర్లకే 110 పరుగులకే కుప్పకూలింది. చరిత్రలోనే టీమ్‌ఇండియా చేతిలో అత్యల్ప స్కోరుకు ఆలౌటైంది. జోస్‌ బట్లర్‌ (30; 32 బంతుల్లో 6x4), డేవిడ్‌ విలే (21; 26 బంతుల్లో 3x4) టాప్‌ స్కోరర్లంటేనే మన బౌలర్ల అటాక్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు! ఆ తర్వాత రోహిత్‌ శర్మ (76; 58 బంతుల్లో 7x4, 5x6), శిఖర్ ధావన్‌ (31; 54 బంతుల్లో 4x4) ఇద్దరే కలిసి 10 వికెట్ల తేడాతో గెలిపించేశారు. విజయం కోసం కేవలం 18.4 ఓవర్లే తీసుకున్నారు.