Illegal Loan Apps : గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్యూష అనే వివాహిత సోమవారం తన ఇంటిపైన ఉన్న రెయిలింగ్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కారణం మార్ఫింగ్ చేసిన నగ్నఫొటోలు పబ్లిక్ లో పెడతాను అని ఆమె స్నేహితులకు వాటిని పంపుతాను అని బెదిరించారు. అయితే ఇదేమీ ఒక ఆకతాయి చేసిన  పనికాదు. ఆమెకు ఆన్ లైన్ లో రుణం ఇచ్చిన ఒక లోన్ యాప్ ఏజెంట్ చేసిన అకృత్యం అది. ఆన్ లైన్ ద్వారా రుణం ఇచ్చి సకాలంలో తీర్చలేదన్న నెపంతో ఓ మహిళను దారుణంగా వేధించిన పరిస్థితి. కేవలం ఇది ప్రత్యూష పరిస్థితి మాత్రమే కాదు. దేశంలో ఎంతోమంది రుణయాప్ ల బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. 


తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే  రెండేళ్లలో పదుల సంఖ్యలో లోన్ యాప్ మరణాలు నమోదయ్యాయి. అవసరం ఉన్న వాళ్లని  వెంబడించి రుణాలు ఇవ్వడం కట్టలేని వారిని రకరకాలుగా వేధించడం వీరిపని. కోవిడ్ కారణంగా ఆదాయాలు కోల్పోయిన చిరు వ్యాపారులు, చిన్న ఉద్యోగులు, గృహిణిలను వీళ్లు టార్గెట్ చేస్తారు. ముందుగా ఫేస్ బుక్ లో అతితక్కువ వడ్డీకే ఎలాంటి హామీ లేకుండా లోన్లు ఇస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తారు. అవసరంలో ఉన్న వాళ్లు తేలిగ్గా రుణం దొరుకుతుందని వీరిని సంప్రదిస్తున్నారు. రోజువారీ వడ్డీలతో వీళ్లు రుణాలు తీర్చలేరు. ఇక ఆ తర్వాత నుంచి వాళ్ల టార్చర్ మొదలవుతుంది. ఒక్కరోజులో మొత్తం సొమ్ము కట్టకపోతే స్నేహితుల ముందు పరువు తీస్తామంటూ బెదిరింపులకు దిగుతారు. మహిళల్ని అయితే వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారు. వీటిని బంధువులకు, పబ్లిక్ లో పంపుతామని బెదిరిస్తున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేకనే చాలా మంది మహిళలు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మంగళగిరిలో జరిగిన ప్రత్యూష ఆత్మహత్య కూడా అలాంటిదే. ఆమెకు అసభ్య పదజాలంతో లోన్ ఏజెంట్లు వాట్సప్‌లో మెసేజ్ పంపించారు. కేవలం ఐదువేలు తిరిగి చెల్లించలేక ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది. ఆ డబ్బులు ఇచ్చినా వాళ్లు వదులుతారని గ్యారెంటీ లేకపోవడమే ఆమె మరణానికి కారణం.  కేవలం ఒక్కరి విషయమే కాదు. గడచిన రెండేళ్లలో హైదరాబాద్, విజయవాడ, గుంటూరులలో ఇలాంటి ఉదంతాలు ఎక్కువుగానే జరిగాయి. 


కేసులు పెడుతున్నా వేధింపులు ఆగడం లేదు


2020 డిసెంబర్‌లో రుణయాప్‌ల వేధింపులపై ఫిర్యాదులు రావడం ఓ వ్యక్తి చనిపోవడంతో పోలీసులు హైదరాబాద్ మొత్తం గాలింపు చేపట్టారు. హైదరాబాద్ కేంద్రంగా 600 మందితో కాల్ సెంటర్‌ నడిపిస్తూ ఈ  మాఫియా పెద్ద నెట్‌వర్క్ నే నడిపినట్లు గుర్తించారు. హైదరాబాద్ సంఘటనతో దేశవ్యాప్తంగా పోలీసులు గాలింపులు జరిపి వివిధ ప్రాంతాల్లో 17 మందిని అరెస్ట్ చేశారు. ఆ కేసులు అప్పటి నుంచీ నడుస్తూనే ఉన్నాయి. అయినా రుణ దారుణాలు ఆగడం లేదు. కిందటి మే నెలలోనే హైదరాబాద్ లో ఆరుకేసులు రిపోర్ట్ అయ్యాయి. ప్రతి రోజూ వచ్చే ఫిర్యాదులు అయితే లెక్కే లేదు. 


రుణ యాప్‌లు -పెద్ద మాఫియా


ఇవి కేవలం ప్రజలకు 5 వేలు,10 వేలు అప్పులిచ్చి ప్రజలను వాడుకుంటున్నవి మాత్రమే కాదు. దేశంలో ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థనే సృష్టిస్తున్నాయి. రుణ యాప్‌ల ద్వారా ప్రజల్లోకి చేరుతున్న డబ్బు వందల కోట్లకు పైగా ఉంటోంది. దేశంలో ఉన్న 1100 యాప్‌లకు సంబంధించి తెరవెనుక నడిపిస్తున్నవి కేవలం కొన్ని సంస్థలు మాత్రమే. ఎక్కువుగా చైనాకు చెందిన ఫిన్‌టెక్ కంపెనీలు వీటి వెనుక ఉంటున్నాయి. దేశంలోని దాదాపు 30 శాతం రుణ మార్కెట్‌ను ఈ షాడో లెండర్స్ ఆక్రమించారు. అన్నీ చిన్న చిన్న రీటైల్ లోన్లు కావడంతో పెద్ద మొత్తంలో కనిపించదు. కానీ సంఖ్యపరంగా ఇది చాలా ఎక్కువ. రుణాల విలువ కూడా వేల కోట్లలో ఉంది. అయితే ఇందులో దాదాపు సగం కంపెనీలు RBI నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేసుకుంటుండగా మిగిలిన 50 శాతం మార్కెట్ ను ఈ షాడో లెండర్స్ ఏలుతున్నారు. హైదరాబాద్ లో అరెస్టు చేసిన కంపెనీల మూలాలన్నీ చైనా, ఇండోనేషియాలో ఉన్నాయి. ఒకవేళ కొన్ని కంపెనీలను మూసేసినా కేవలం కొన్ని రోజుల్లోనే మరో రూపంలో వస్తున్నారు. వీటిని నియంత్రించడం పెద్ద సవాల్‌గా మారింది. 


మార్కెట్‌లోకి వస్తోంది ఇలా


వడ్డీ వ్యాపారం చేయాలంటే ఆర్బీఐ నిబంధనల ప్రకారం లైసెన్సు ఉండాలి. నాన్ బ్యాంకింగ్  ఫైనాన్స్ కంపెనీ- NBFCలకు మాత్రమే ఈ అనుమతి ఉంటుంది. అయితే ఫిన్ టెక్ కంపెనీలు ఇందులోకి తెలివిగా జొరబడుతున్నాయి. దేశంలో పనిచేయకుండా ఉన్న NBFCలు చాలా ఉన్నాయి. ఇవి వాళ్లకి తాయిలాలు ఇచ్చి వారి లెసెన్సును తమ వ్యాపారానికి వాడుకుంటాయి. వాస్తవానికి ఫిన్‌టెక్ కంపెనీ ఒక నాన్ బ్యాంకింగ్ కంపెనీకి కస్టమర్లను వెతకడంలో సాయం మాత్రమే చేయాలి. పైకి అలాగే చెబుతారు. NBFCకి ఫిన్ టెక్ సంస్థ సాయం చేయాలి. అక్కడ రివర్సులో జరుగుతుంది. మొత్తం వ్యవహారాలను ఈ చైనా ఫిన్‌టెక్ కంపెనీలే ఆక్రమిస్తున్నాయి. వారి లైసెన్సుతో ఇవే వ్యాపారాలు చేస్తాయి. ఇంకా దారుణం ఏంటంటే కొన్ని కంపెనీలు అసలు లైసెన్సు కూడా లేకుండానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. జస్ట్ గూగుల్ ప్లే స్టోర్‌లో సెర్చ్ చేస్తే చాలు కుప్పలు తెప్పలుగా ఈ యాప్‌లు కనిపిస్తుంటాయి. 


ఈడీ దాడులు చేసినా 


హైదరాబాద్ ఘటనలో ముఖ్యంగా నాలుగు కంపెనీల పాత్రను గుర్తించారు. Kudos, Acemoney, Rhino and Pioneer సంస్థలు ఎక్కువుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించిన ఈడీ వీళ్లను ఆస్తులను ఎటాచ్ చేయడం ప్రారంభించింది. Prevention of Money Laundering Act-PMLA కింద వీరి ఆస్తులను అటాచ్ చేస్తూ వచ్చారు. పేమెంట్ గేట్ వే ద్వారా ఈ యాప్‌లకు అనుసంధానమై ఉన్న బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. జులై నెలలోనే 86 కోట్ల పేమెంట్లను అటాచ్‌ చేయగా.. ఇప్పటి వరకూ  ఈ కేసులో అటాచ్ చేసిన ఆస్తి విలువ రూ.1569 కోట్లు! ఈ స్థాయిలో ఎన్‌ఫోర్సుమెంట్ ఏజన్సీల చట్రాన్ని బిగిస్తున్నా యాప్‌ల దారుణాలు ఆగడం లేదు. మరో రూపంలో వీళ్లు వస్తూనే ఉన్నారు. 


గూగుల్‌ కారణమా?


దేశంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా గూగుల్ నియంత్రించలేకపోతోందని ఈ రంగంలోని నిపుణులు ఆరోపిస్తున్నారు. వారు గూగుల్‌నే తప్పుపడుతున్నారు. దేశంలోని స్మార్ట్‌ఫోన్లలో 98 శాతం ఆండ్రాయిడ్ ఫోన్లు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ప్రతి ఒక్కరూ ఈ యాప్‌లను డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. ఒకవేళ వారికి తెలీకపోయినా గూగుల్ యాడ్ లు, ఫేస్ బుక్ యాడ్‌ల ద్వారా జనాలకు చేరువవుతున్నారు. రుణయాప్‌లు ఈ స్థాయిలో చెలరేగిపోవడానికి గూగుల్ సరిగ్గా నియంత్రించలేకపోవడమేనని Save Them India ఫౌండేషన్ డైరక్టర్ ప్రవీణ్ కలైసెల్వన్ ఆరోపిస్తున్నారు. ఈ NGO కొన్నాళ్లుగా సైబర్‌నేరాలు, మొబైల్ లోన్  యాప్ ల దురాగతాలపై పోరాడుతోంది. దీనివల్ల జరుగుతున్న అనర్థాలపై ప్రవీణ్ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఆయన్ను ABP Desam సంప్రదించింది. "ఈ విషయంలో కచ్చితంగా గూగుల్‌ దే తప్పు" అని ఆయన అంటున్నారు. లైసెన్సు లేని యాప్‌లను గూగుల్ ప్లాట్‌ఫామ్ పై అనుమతించడం వల్లే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని.. ఈ విషయంపై తాము గూగుల్‌ను సంప్రదించినా వారు చర్యలు తీసుకోలేకపోతున్నారన్నారు. "పోలీసు FIR ఉన్న కేసులపై మాత్రమే గూగుల్ స్పందిస్తోంది కానీ... అసలు వాటి ఉనికికి కారణమైన తమ ప్లాట్‌ఫామ్ పై వాటిని అనుమతించే విషయాన్ని నియంత్రించడంలేదని"  ప్రవీణ్ అంటున్నారు.  ప్రమాదకరంగా ఉన్న 230 మొబైల్ అప్లికేషన్లను ప్లే స్టోర్‌ నుంచి తొలగించాలని తాము కోరినా ఇంకా ఆ పనిజరగలేదన్నారు. కేవలం బెదిరింపులు మాత్రమే కాదు దేశప్రజలకు సంబంధించిన భారీ డేటాను ఈ చైనా కంపెనీలు తస్కరిస్తున్నాయని వాటిని ఏ కార్యకలాపాలకు వాడతారో అన్న దానిపై కూడా ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. Save Them India ఫౌండేషన్ కు ప్రతి ఏడాది రుణ యాప్‌ల విషయంలో ఫిర్యాదులు పెరుగుతూనే ఉన్నాయి. 2021 లో  49వేల మంది ఈ సంస్థ హెల్ప్ లైన్‌ను సంప్రదిస్తే.. ఈ ఏడాది జూన్ నాటికే 70వేల మంది కాల్స్ చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


RBI కి లేఖ రాసిన తెలంగాణ


రుణ దురాగతాలపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎన్నికేసులు పెట్టినా ఏదో ఓ రూపంలో ఈ యాప్‌లు ప్రజల్లోకి వస్తున్నాయని తెలంగాణ ఆర్థిక శాఖ RBIకి లేఖ రాసింది. కిందటేడాది తెలంగాణలో 61 కేసులు నమోదు అయితే ఈ ఏడాది ఇప్పటికే 900 ఫిర్యాదులు అందాయని వీటిలో 107 కేసులు నమోదు చేశామని తెలిపింది. ఈ యాప్‌లు నియంత్రించే వ్యవస్థీకృత ఏర్పాటు ఉండాలని తెలంగాణ ఆర్బీఐని కోరింది. 


భయపడొద్దు- ఫోన్ ఫార్మాట్ చేయండి


రుణయాప్‌ల ఏజంట్ల బెదిరింపులకు భయపడొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అనుమతి లేని సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం మానేయాలని.. మార్కెట్‌లో చిన్న మొత్తాలను వడ్డీకి ఇచ్చే నమ్మకమైన సంస్థలు యాప్‌లు కూడా ఉన్నాయని.. సరైన అవగాహనతో వాటిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ రుణ యాప్‌లు బెదిరిస్తున్నా భయపడొద్దని దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులను ఉన్నతాధికారులను సంప్రదించాలంటున్నారు. యాప్‌లు కోరిన వెంటనే మన కాంటాక్ట్స్, ఫొటోలు వంటి వాటిని యాక్సెస్ చేసే అవకాశాన్ని ఇవ్వకుండా సెట్టింగ్స్ మార్చుకోవాలంటున్నారు. ఒకవేళ అన్నీ చేసినా బెదిరిస్తుంటే మన సమాచారం వాళ్లకి చేరకుండా ఫోన్‌ను ఫార్మాట్‌ చేసుకుని నెంబర్‌ మార్చుకుంటే సరిపోతుందని అనవసరమైన ఆందోళనతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సలహా ఇస్తున్నారు.