England Allout for 110 in first odi aganist India: ఓవల్‌ మైదానంలో మోత మోగింది! పరుగుల వరదతో మోగిన అలజడి కాదది! టీమ్‌ఇండియా పేసర్లు తీసిన వికెట్ల ఊచకోత అది! క్రీజులో నిలబడితే చితకబాదే ఆంగ్లేయులను భారత బౌలర్లు జడిపించేశారు! చురకత్తుల్లాంటి ఇన్‌స్వింగింగ్‌, ఔట్‌ స్వింగ్‌ బంతులతో దాడి చేశారు. బంతిని ఆడితే ఔటవ్వడం ఖాయమే అన్నట్టుగా ప్రత్యర్థి బ్యాటర్లను వణికించేశారు. 50 ఓవర్ల మ్యాచులో ఆతిథ్య జట్టును 25.2 ఓవర్లకే కుప్పకూల్చారు. జస్ప్రీత్‌ బుమ్రా (6/19), మహ్మద్‌ షమి (3/31) బౌలింగ్‌ ధాటికి తట్టుకోలేక బట్లర్‌ సేన 110 పరుగులకే ఆలౌటైంది. జోస్‌ బట్లర్‌ (30; 32 బంతుల్లో 6x4), డేవిడ్‌ విలే (21; 26 బంతుల్లో 3x4) టాప్‌ స్కోరర్లు.


England have been dismissed for their lowest ever score in ODIs against India: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు టీమ్‌ఇండియా పేసర్లు చుక్కలు చూపించారు. చల్లని వాతావరణం, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. కఠినమైన లైన్‌ అండ్‌ లెంగ్తుల్లో బంతులేశారు. బంతి అందుకున్న క్షణం నుంచే జస్ప్రీత్‌ బుమ్రా ప్రత్యర్థులను భయపెట్టేశాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌, జో రూట్‌ను డకౌట్‌ చేసేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బెన్‌స్టోక్స్‌ను పరుగుల ఖాతా తెరవకముందే మహ్మద్‌ షమీ ఔట్‌ చేశాడు. దాంతో 7 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు చేజార్చుకుంది.


టాప్‌-4లో ముగ్గురు డకౌట్‌ కావడం ఇంగ్లాండ్‌ చరిత్రలో ఇది రెండోసారి. ఆ తర్వాతా పతనం ఇలాగే కొనసాగింది. 17 స్కోర్‌ వద్ద బెయిర్‌స్టో (7)ను బుమ్రాయే పెవిలియన్‌ చేర్చాడు. లియామ్‌ లివింగ్‌ స్టన్‌ (0)ను అతడే ఔట్‌ చేశాడు. కీలకమైన బట్లర్‌, ఓవర్టన్‌ను షమి పెవిలియన్‌కు పంపాడు. మొయిన్‌ అలీ (14) వికెట్‌ ప్రసిద్ధ్‌కు దక్కింది. దాంతో 103 పరుగులకే ఇంగ్లాండ్‌ 9 వికెట్లు నష్టపోయింది. ఆఖర్లో కేర్స్‌ (15)ను ఔట్‌ చేసి బుమ్రా ఆరు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఆంగ్లేయులకు భారత్‌పై ఇదే అత్యల్ప స్కోరు.