IND vs AUS Test Series: భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (IND vs AUS) ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, భారత జట్టు రెండో స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెడ్ బాల్‌తో ఈ రెండు జట్ల మధ్య పోరు చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అనేక ఇతర కారణాల వల్ల ఈ టెస్ట్ సిరీస్ కూడా చాలా ప్రత్యేకమైనది.
భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై ప్రపంచం ఎందుకు దృష్టి సారిస్తోంది?
ఈ టెస్ట్ సిరీస్ ఫలితమే ఈ సంవత్సరం జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2021-23 ఫైనల్‌కు మార్గం ఏర్పడుతుంది. ఈ రెండు జట్లలో ఒకటి లేదా రెండు జట్లూ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరి చూపు ఈ సిరీస్‌పైనే ఉంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల పరంగా చూసుకుంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య మాత్రమే జరగనుంది.
ఒకవేళ భారత జట్టు ఈ టెస్టు సిరీస్‌ను 2-0, 3-0, 4-0 లేదా 3-1 తేడాతో కైవసం చేసుకుంటే, టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను దాటేసి నంబర్-1 అవుతుంది. యాషెస్ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. టెస్టు క్రికెట్‌లో ఈ రెండు జట్లు ఎప్పుడైతే ముఖాముఖి తలపడుతున్నాయో.. అప్పుడు క్రికెట్ ప్రపంచం దృష్టి ఈ సిరీస్‌పైనే ఉంటుంది.
ఎవరిది పైచేయి?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టిక, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లను వారి సొంత మైదానంలోనే ఏకపక్షంగా ఓడించింది. అదే సమయంలో ఉపఖండంలో ఈ జట్టు పాకిస్తాన్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. దీనికి భిన్నంగా గత ఏడాది భారత జట్టు టెస్టు గణాంకాలు అంత గొప్పగా ఏమీ లేవు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై టెస్టుల్లో ఓడిన భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి జట్లపై మాత్రమే విజయం సాధించగలిగింది.
అయితే సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కూడా అంత తేలికైన విషయం కాదు. గత 18 ఏళ్లలో ఆస్ట్రేలియా జట్టు ఒక్కసారి కూడా భారత్‌లో టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయింది. ఆస్ట్రేలియాలో ఆడిన చివరి రెండు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలను కూడా భారత జట్టే గెలుచుకుంది. ఆస్ట్రేలియా ముందున్న టీమ్ ఇండియా కూడా ఎక్కడా బలహీనంగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి సిరీస్‌లో ఎవరిది పైచేయి అని చెప్పడం కష్టం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత ప్రధాన పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా పూర్తిగా అందుబాటులో ఉండడని సమాచారం. అతను వెన్నెముక గాయం నుంచి కోలుకోవడానికి మరికాస్త సమయం పడుతుందని ఎన్‌సీఏ పర్యవేక్షకులు అంచనా వేస్తున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు నుంచీ జస్‌ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. వెన్నెముక గాయమే ఇందుకు కారణం. తీవ్రత ఎక్కువగా ఉండటంతో అత్యంత కీలకమైన ప్రపంచకప్ కూడా ఆడలేదు.