Amar Raja Factory Fire Accident: చిత్తూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లాలోని యాదమరి మండలం, మోర్ధానపల్లె సమీపంలోని అమర్ రాజా ఫ్యాక్టరీలో‌ భారీ సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ నుండి భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చునని సమాచారం. సమాచారం అందుకున్న యాదమరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అమర్ రాజా ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తీ నష్టం వాటిల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. భారీ అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల కొన్ని మీటర్లు, దాదాపు కిలోమీటర్ మేర పొగలు వ్యాపించాయి.



గతంలోనూ భారీ అగ్నిప్రమాదం, రూ.20 కోట్ల నష్టం 
చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా గ్రూప్ నకు చెందిన మంగళ్ ఇండస్ట్రీస్‌లో గతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆరేళ్ల కిందట పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో అమర రాజా గ్రూపునకు చెందిన ఇండస్ట్రీలో జరిగిన అగ్ని ప్రమాదంతో రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లింది.  అయితే ఎలాంటి ప్రాణనష్టం, ఎవరికి గాయాలు లాంటివి కాలేదు. 2017లో జనవరి నెలలో యూనిట్ లోని జింగ్ కోటింగ్ సెగ్మెంట్ వద్ద కంట్రోల్ ప్యానెల్ నుంచి నిప్పు రవ్వ వచ్చింది. షిఫ్ట్ సిబ్బంది తమ పనిలో నిమగ్నమై ఉండగా కొన్ని నిమిషాల్లోనే ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఆ ఫ్యాక్టరీ యూనిట్‌లోని దాదాపు 300 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.