Cameron Green & Mitchell Starc: భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. వాస్తవానికి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్-ఆస్ట్రేలియా సిరీస్ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా బోర్డర్-గవాస్కర్ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం కానుంది. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో చోటు దక్కించుకోవాలని భారత జట్టు కన్నేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా పాల్గొనడం దాదాపు ఖాయమైంది.


తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ దెబ్బ
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా నంబర్ టూ స్థానంలో ఉంది. భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు బలమైన పోటీదారుగా ఉంటుంది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ తొలి మ్యాచ్‌ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో జరగనుండగా, ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయాల కారణంగా తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడలేరు.


మిచెల్ స్టార్క్, కామెరాన్ గ్రీన్ నాగ్‌పూర్ టెస్ట్‌కు దూరం
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌తో పాటు ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడకపోవడం కంగారూ జట్టుకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అయితే ఈ సిరీస్‌లోని రెండో టెస్టు మ్యాచ్‌లో ఆటగాళ్లిద్దరూ తిరిగి వస్తారనే నమ్మకం ఉంది. ప్రస్తుతం భారత జట్టు శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడుతోంది. శ్రీలంకతో మూడ టీ20 మ్యాచ్‌ల తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.


మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య జనవరి 10వ తేదీన గౌహతిలో తొలి మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది. అయితే ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఆతిథ్య ఆస్ట్రేలియా సిరీస్‌ను కైవసం చేసుకుంది.