AP BJP Politics :   ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో జిల్లాల అధ్యక్ష పదవుల మార్పు కలకలం సృష్టిస్తోంది.. ఇటీవలే ఆరు జిల్లాలకు అధ్యక్షులను మార్చేశారు బీజేపీ ఏపీ చీఫ్‌ సోము వీర్రాజు. వారంతా మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ బీజేపీ ఛీప్ గా ఉన్నప్పుడు నియమితులైన వారు. దీంతో కన్నా వర్గాన్ని టార్గెట్ చేసి పక్కన పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.  ఏకపక్షంగా పదవులను మార్చారంటూ పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు నేతలు.  శ్రీకాకుళం జిల్లా ఇంఛార్జ్‌ చిగురుపాటి కుమారస్వామి. అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట నగేష్‌, రెడ్డి నారాయణరావు రాజీనామాలు చేశారు. వీరంతా సోము వీర్రాజు తీరును తప్పు పడుతున్నారు.  


పార్టీ విధానం ప్రకారమే మార్పు చేర్పులంటున్నసోము వీర్రాజు 


పార్టీ విధానాలను అనుసరించే పదవుల్లో మార్పులు చేర్పులు చేశామని  ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు.  జిల్లా అధ్యక్షులుగా ఉన్న వాళ్లకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం ప్రమోషన్‌ అంటున్నారు.  కన్నా లక్ష్మీ నారాయణను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. జాతీయ కార్యవర్గ సభ్యుడుగా తీసుకున్నారని అంటున్నారు.  పార్టీ నుంచి వీలైనంత త్వరగా బయటకెళ్లాలనుకునే వారు తెర వెనుక ఉండి.. రాజీనామాల ఎపిసోడ్‌ నడిపిస్తున్నారని సోము వర్గం ఫైర్‌ అవుతోంది . ఏపీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. పార్టీ నుంచి కన్నానే బయటకు వెళ్లాలనుకుంటున్నారని సోము వీర్రాజు వర్గం వ్యహాత్మకంగా ప్రచారం చేస్తోందని కన్నా వర్గం అనుమానిస్తోంది. 


కన్నా వర్గాన్ని పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్న సోము వీర్రాజు 


కన్నా లక్ష్మినారాయణను అవమానపరచాలని ఆయన సన్నిహితులను పదవుల నుంచి తొలగించడం లేదని ్ంటున్నారు. అలా అయితే కన్నా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వైదొలిగిన వెంటనే  మార్చేసేవాళ్లం కదా? అంటూ ప్రశ్నలు సందిస్తోంది సోము వీర్రాజు వర్గం. ఇటీవల ఏపీలో అమిత్ షా పర్యటన ఖరారైంది.ఆ తర్వాత రద్దయింది. దీనికి కూడా ఏపీ బీజేపీలోని నేతల ఆధిపత్య పోరాటమేనని భావిస్తున్నారు. కన్నా లక్ష్మినారాయణ ఇటీవలి కాలంలో సోము వీర్రాజు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆయన పార్టీని వైసీపీకి అనుకూలంగా నడుపుతున్నారని.. బీజేపీలోని బలోపేతం చేయడం లేదంటున్నారు. 


కన్నా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ప్రచారం


అయితే కన్నా లక్ష్మినారాయణ బీజేపీని వీడి జనసేన లేదా టీడీపీలో చేరాలనుకుంటున్నారని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సోము వర్గం అంటోంది. అయితే్ జనసేన పార్టీ ప్రస్తుతం  బీజేపీతో పొత్తులో ఉంది.  బీజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరితే.. అలా చేర్చుకుంటే.. రెండు పార్టీల మధ్య పొత్తు చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కన్నా విమర్శలను సోము వీర్రాజు వర్గం లైట్ తీసుకుంటోంది. మీడియా ముందు మాట్లాడితే వివాదం పెద్దది అవుతుంది కానీ.. పరిష్కారం కాదని.. కన్నా ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయనివ్వాలని అనుకుంటున్నారు. ముందు  ముందు ఏపీ బీజేపీలో మవర్గ పోరాటం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.