Border Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. రెండు దేశాల మధ్య జరిగే ఈ సిరీస్ ఎప్పుడూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది.


ఆస్ట్రేలియా ఇంతకుముందు 2017 సంవత్సరంలో ఈ సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. ఈ టూర్‌లోని రెండో మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మధ్య వాగ్వాదం జరిగింది. విరాట్ కోహ్లీ డీఆర్ఎస్ విషయంలో స్టీవ్ స్మిత్‌తో గొడవ పడ్డాడు.


2017లో బెంగుళూరులో టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఉమేష్ యాదవ్ ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీని తర్వాత స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూశాక డీఆర్ఎస్ కోసం అడగటం ప్రారంభించాడు. దీంతో స్మిత్‌పై కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు.


ఆ తర్వాత ఫీల్డ్ అంపైర్ కూడా స్టీవ్ స్మిత్‌ను అవుట్ అయినట్లు ప్రకటించాడు. ఈ సంఘటన జరిగాక విరాట్ కోహ్లీ రియాక్షన్‌ కూడా కొంచెం వైల్డ్‌గానే ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


క్రికెట్‌లో లైన్ దాటకూడదు: విరాట్ కోహ్లీ
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, 'నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇది రెండు సార్లు చూశాను. నేను కూడా ఈ విషయం అంపైర్‌కి చెప్పాను. వారి ఆటగాళ్లు డీఆర్ఎస్‌ విషయంలో డ్రస్సింగ్ రూం సాయం తీసుకోవడం గమనించాను. గత మూడు రోజులుగా ఇలాగే చేస్తున్నామని, దీన్ని ఆపాలని మ్యాచ్ రిఫరీకి కూడా చెప్పాం. అంపైర్ ఆ విషయాన్ని గమనించడానికి కారణం ఇదే. అతను అవుట్ కావడంతో ఏం జరుగుతుందో అంపైర్‌కి తెలిసింది.’


కోహ్లీ ఇంకా మాట్లాడుతూ, “మీరు క్రికెట్ మైదానంలో దాటకూడని లైన్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే ప్రత్యర్థులతో ఆడుకోవటం, స్లెడ్జింగ్ చేయడం వేరు. వారు చేసిన దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అది ఆ లైన్ కిందకే వస్తుంది.’ అని అన్నారు.


ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ మధ్య ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక మూడో టెస్టు మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 5వ తేదీ దాకా ధర్మశాలలో జరగనుంది. మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ దాకా అహ్మదాబాద్‌ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.


దీని తర్వాత రెండు జట్లూ మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనున్నాయి. ఈ సిరీస్‌లో తొలి వన్డే ముంబైలో, రెండో వన్డే విశాఖపట్నంలో, మూడో వన్డే చెన్నైలో జరగనుంది. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత జట్టు వద్ద ఉంది. చివరిసారిగా ఆస్ట్రేలియా జట్టును సొంతగడ్డపై ఓడించి టీమిండియా సిరీస్‌ను గెలుచుకుంది.