IND Vs AUS: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్‌ రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా పై చేయి సాధించింది. ఈ సెషన్‌లో ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 74 పరుగులు సాధించింది. దీంతో మొదటి రోజు టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 149 పరుగులు సాధించింది. ఈ రెండు వికెట్లూ మొదటి సెషన్లోనే పడ్డాయి. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా (65 బ్యాటింగ్: 180 బంతుల్లో, 10 ఫోర్లు), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (38 బ్యాటింగ్: 129 బంతుల్లో, మూడు ఫోర్లు) ఉన్నారు.


రెండో సెషన్‌లో భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ అస్సలు వికెట్ ఇవ్వలేదు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. పరుగులు రాకపోయినా ముందు క్రీజులో నిలబడితే చాలు అనే యాటిట్యూడ్ వారిలో కనిపించింది.


ముఖ్యంగా స్పిన్ త్రయం అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను మరింత జాగ్రత్తగా ఆడారు. వీరు ముగ్గురూ మాత్రమే ఇప్పటి వరకు 40 ఓవర్లు బౌల్ చేశారు. ఇందులో కేవలం 82 పరుగులు మాత్రమే వచ్చాయి. అక్షర్ పటేల్ ఎకానమీ అయితే ఏకంగా 1.3 మాత్రమే ఉంది. దీన్ని బట్టి స్పిన్నర్లకు అస్సలు వికెట్ తీసే అవకాశం కూడా ఇవ్వకూడదనే వ్యూహంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగినట్లు అర్థం అవుతోంది.


కీలకమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ఆడింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ భారత్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. 61 పరుగుల వద్ద భారత్‌కు తొలివికెట్‌ ట్రావిస్ హెడ్ రూపంలో దొరికింది. కేవలం 44 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ ఏడు బౌండరీలు సాధించాడు. ఇతను 32 పరుగుల స్కోరు వద్ద అవుటయ్యాడు.


ట్రావిస్ హెడ్‌ను రవిచంద్రన్ అశ్విన్ బోల్తా కొట్టించాడు. 16వ ఓవర్‌ తొలి బంతికే జడేజా క్యాచ్ పట్టి హెడ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. తర్వాత మార్నస్ లబుషేన్‌ను మహ్మద్‌ షమీ క్లీన్ బౌల్డ్‌ చేశాడు. దీంతో 72 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన రెండో వికెట్ కోల్పోయింది. మార్నస్ లబుషేన్‌ (3: 20 బంతుల్లో) వచ్చిన కాసేపటికే వెనుదిరిగాడు. భారత ‌బౌలర్లలో మహ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్ చేరో వికెట్ తీసుకున్నారు.


ఈ మ్యాచ్‌లో అనుకున్నట్టుగానే టీమిండియా సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చి షమిని బరిలో దింపింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టులో టీమ్ఇండియా ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. భారత వెటరన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షమీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించడం జట్టుకు ప్రయోజనం చేకూరింది. ఓ వికెట్‌ను షమీ తీసుకున్నాడు.


అహ్మదాబాద్ లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ హాజరయ్యారు. టీమిండియా టెస్టు క్యాప్‌ను రోహిత్ శర్మకు ప్రధాని నరేంద్ర మోదీ అందజేశారు. అదే సమయంలో స్టీవ్ స్మిత్ కు టీమ్ క్యాప్‌ను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఇచ్చారు.