భారత్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా మంచి స్కోరును సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ఓపెనర్ మిషెల్ మార్ష్ (47: 47 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (33: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), మిషెల్ మార్ష్ (47: 47 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 10.5 ఓవర్లలోనే 68 పరుగులు జోడించారు. ఈ దశలో ఆస్ట్రేలియాను హార్దిక్ పాండ్యా దెబ్బ తీశాడు. ట్రావిస్ హెడ్ వికెట్‌ను తీసి భారత్‌కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. అనంతరం తన వరుస ఓవర్లలో మరో ఓపెనర్ మిషెల్ మార్ష్, వన్ డౌన్ బ్యాటర్, కెప్టెన్ అయిన స్టీవ్ స్మిత్‌లను (0: 3 బంతుల్లో) కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 14.3 ఓవర్లలోనే 85 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత డేవిడ్ వార్నర్ (23: 31 బంతుల్లో, ఒక ఫోర్), మార్నస్ లబుషేన్ (28: 45 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరు నాలుగో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. క్రమంగా ఇద్దరూ క్రీజులో కుదురుకుంటున్న దశలో ఈసారి కుల్‌దీప్ యాదవ్ ఆస్ట్రేలియాకు గట్టి షాక్ ఇచ్చాడు. డీప్ మిడ్ వికెట్ వైపు లాఫ్టెడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ లాంగాఫ్‌లో హార్దిక్ పాండ్యా చేతికి చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియా 25 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి 126 పరుగుల స్కోరును చేసింది.
సగం ఓవర్లు ముగిసిన కాసేపటికే క్రీజులో నిలదొక్కుకున్న బ్యాటర్ మార్నస్ లబుషేన్ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ కారీ (38: 46 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ (25: 26 బంతుల్లో, మూడు ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. కానీ వీరిద్దరూ ఏడు పరుగుల వ్యవధిలోనే అవుటయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 203 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ టెయిలెండర్లు సీన్ అబాట్ (26: 23 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), ఆస్టన్ అగర్ (17: 21 బంతుల్లో, ఒక సిక్సర్) పోరాటం ఆపలేదు.
వీరు ఎనిమిదో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. కానీ వీరు ఇద్దరూ కూడా రెండు పరుగుల వ్యవధిలోనే అవుటయ్యారు. 10, 11వ నంబర్ బ్యాటర్లు మిషెల్ స్టార్క్ (10: 11 బంతుల్లో, ఒక సిక్సర్), ఆడం జంపా (10: 11 బంతుల్లో, ఒక ఫోర్)కూడా రెండంకెల స్కోరు సాధించడంతో ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. మొత్తం ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ తప్ప అందరూ రెండంకెల స్కోరు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.