Delhi Liquor Policy:


ఏప్రిల్ 5 వరకూ కస్టడీలోనే..


ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరి కొద్ది రోజుల పాటు పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 5వ తేదీ వరకూ కస్టడీలోనే ఉండాలని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో మనీశ్ సిసోడియా అభ్యర్థననూ పరిగణనలోకి తీసుకుంది. కస్టడీలోకి ఆధ్యాత్మిక పుస్తకాలు తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని సిసోడియా కోరారు. దీనిపై అప్లికేషన్ పెట్టుకోవాలని కోర్టు వెల్లడించింది. ఇప్పటికే సిసోడియా బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. ఇంకా దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ పిటిషన్‌పై ఈడీ వివరణను కోరింది కోర్టు. స్పెషల్ జడ్జ్ ఎమ్‌కే నాగ్‌పాల్‌ ఈ విషయమై ఈడీకి నోటీసులు ఇచ్చారు. మార్చి 25లోగా సమాధానం చెప్పాలని ఆదేశించారు. మార్చి 17న రౌజ్ అవెన్యూ కోర్టు సిసోడియా కస్టడీని ఐదు రోజుల పాటు పొడిగించింది. అది నేటితో ముగిసింది. ఈ మేరకు మరోసారి ఆయనను కోర్టులో హాజరు పరిచింది ఈడీ. మళ్లీ విచారించిన కోర్టు...ఏప్రిల్ 5 వరకూ కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 










ఈడీ వివరణ ఇది..


ఈడీ సిసోడియా ఫోన్‌లు,ఈ మెయిల్స్‌ను ఫోరెన్సిక్ అనాలసిస్‌ చేస్తున్నామని కోర్టుకు తెలిపింది. సిసోడియా కస్టడీలో ఉన్న సమయంలోనే కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయని తేల్చి చెప్పింది. గతేడాది ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాపై కేసు నమోదైన వెంటనే ఆయన తన మొబైల్‌ మార్చేశారని ఆరోపించింది. ఆ ఫోన్‌ను ఏం చేశారో అన్నది మాత్రం చెప్పలేకపోతున్నామని తెలిపింది. 2021 మార్చి నాటి డాక్యుమెంట్‌ల ఆధారంగా చూస్తే ఈ పాలసీలో సిసోడియాకు 5% కమీషన్‌ ఉన్నట్టు చెబుతోంది ఈడీ. అయితే 2022 సెప్టెంబర్ నాటికి అది 12%కి పెరిగిందని వివరించింది. సిసోడియా తరపు న్యాయవాది మాత్రం దర్యాప్తు సంస్థలు చెప్పిందే చెబుతున్నాయి తప్ప కొత్త ఆధారాలేవీ వెలుగులోకి తీసుకురావడం లేదని వాదిస్తున్నారు. వారం రోజుల పాటు కస్టడీలో ఉంచినా... మొత్తం మీద ఆయనను 10-12 గంటల మాత్రమే ప్రశ్నించారని చెబుతున్నారు. ఈడీ మాత్రం తాము రోజుకి 5-6 గంటల పాటు విచారిస్తున్నట్టు చెబుతోంది. "మనీశ్ సిసోడియా ఆదేశాల ప్రకారమే ఇది జరిగిందని మా వద్ద సమాచారం ఉంది. మద్యం అమ్మకానికి లైసెన్స్ ఇవ్వడానికి నిర్ణయించిన వ్యవస్థను కూడా ఉల్లంఘించారు.  కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులు దాని నుంచి ప్రయోజనం పొందారు" అని ED తెలిపింది. తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవితతో సహా సౌత్ గ్రూప్‌తో పాటు సిసోడియా సహాయకుడు విజయ్ నాయర్ మొత్తం కుట్రను సమన్వయం చేశారు, వ్యాపారవేత్త దినేష్ అరోరా కిక్‌బ్యాక్‌లను సమన్వయం చేస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. దిల్లీలోని ఎక్సైజ్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ వాటాదారుగా మారిందని ఈడీ పేర్కొంది.  


Also Read: దయచేసి రిజైన్ చేయండి, లేదంటే మేమే బయటకు పంపాల్సి ఉంటుంది - జుకర్ బర్గ్ మెయిల్ వైరల్