టీమ్‌ఇండియా అద్భుతం చేసింది! దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఆసియా ఛాంపియన్‌షిప్‌ హాకీ మ్యాచులో చిరకాల శత్రువును 3-1 తేడాతో చిత్తుగా ఓడించింది. సెమీ ఫైనల్‌కు చేరుకుంది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు, ఆకాశ్‌దీప్‌ సింగ్‌ ఒక గోల్‌ చేశారు.


తొలి క్వార్టర్‌ ఆరంభంలోనే టీమ్‌ఇండియాకు షాక్‌ తగిలింది. గ్రీన్‌కార్డు చూపించడంతో ఆకాశ్‌దీప్‌ సింగ్‌ రెండు నిమిషాల పాటు బయటే ఉన్నాడు. భారత్‌ పది మందితోనే ఆట మొదలు పెట్టినా బంతిని తన నియంత్రణలోనే ఉంచుకుంది. ఏడో నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. పాక్‌ వైపు ఒకరు తక్కువ ఉన్నవేళ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సునాయాసంగా బంతిని నెట్స్‌లోకి పంపించేశాడు. దాంతో 1-0తో  భారత్‌ క్వార్టర్‌ను ముగించింది.






రెండో క్వార్టర్లో రెండు జట్లు గోల్‌ చేసేందుకు విపరీతంగా ప్రయత్నించాయి. కానీ డిఫెన్స్‌తో ఒకరి అవకాశాలను మరొకటి అడ్డుకున్నాయి. మూడో క్వార్టర్‌ ఆఖర్లో భారత్‌కు మరో గోల్‌ లభించింది. 42వ నిమిషంలో లక్రా పాస్‌ చేసిన బంతిని ఆకాశ్‌దీప్‌ ఒడుపుగా నెట్స్‌లోకి పంపించి స్కోరును 2-0కు పెంచాడు. కానీ మరో మూడు నిమిషాల్లోనే జునైద్‌ మంజూర్‌ గోల్‌ కొట్టి భారత స్కోరును 1-2 తగ్గించాడు. ఆఖరి క్వార్టర్లో పాక్‌కు లభించిన పెనాల్టీ కార్నర్లను టీమ్‌ఇండియా సమర్థంగా అడ్డుకొంది. అంతేకాకుండా 53వ నిమిషంలో లభించిన పీసీని డ్రాగ్‌ఫ్లికర్‌ హర్మన్‌ నెట్స్‌లోకి పంపించి 3-1తో జట్టును తిరుగులేని ఆధిక్యంలో నిలిపాడు. ఘన విజయం అందించాడు.