ఆస్ట్రేలియా ఓపెన్(Australian Open 2024) లో పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్, ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్(Iga Swiatek)కు మూడో రౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో స్వైటెక్‌పై.. అన్‌సీడెడ్ నొకోవా(Linda Noskova) విజయం సాధించింది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో టాప్ సీడ్ స్వైటెక్ 6-3, 3-6, 4-6తో ప్రపంచ 50వ ర్యాంకర్ లిండా నొకోవా చేతిలో ఓడింది. తొలి సెట్‌ను సునాయసంగానే గెలిచిన స్వైటెక్.. ఆ తర్వాత అనవసర తప్పిదాలు, పేలవ సర్వీసులతో ఓడిపోయింది. రెండున్నర గంటల పాటు సాగిన పోరులో స్వైటెక్ 4 ఏస్‌లు కొట్టి ఒక డబుల్ ఫాల్ట్ చేస్తే.. నొకొవా 10 ఏస్‌లు బాదింది. స్వైటెక్ 34 విన్నర్లు సంధిస్తే.. నొకొవా 35 విన్నర్లు కొట్టి.. 37 అనవసర తప్పిదాలు చేసింది. బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లు ఆడిన నోస్కోవా.. రెండో సెట్ ఎనిమిదో గేమ్‌లో స్వైటెక్ సర్వీస్ బ్రేక్ చేసి 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరుతో సెట్ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లో స్వైటెక్ కాస్త మెరుగ్గా ఆడినా.. నోస్కోవా తగ్గలేదు. ఏ దశలోనూ స్వైటెక్‌కు అవకాశం ఇవ్వలేదు. అంతేకాక ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 4-3తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈ రష్యా అమ్మాయి..అదే దూకుడు కొనసాగించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న స్వైటెక్.... ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాత్రం అదే జోరు కనబర్చలేకపోతోంది. మెల్‌బోర్న్‌లో స్వైటెక్ ఒక్కసారి కూడా సెమీఫైనల్ దాటలేదు. మిగిలిన మ్యాచుల్లో పన్నెండో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), 18వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్), స్వితోలినా (ఉక్రెయిన్) ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఇప్పటిదాకా రెండో రౌండ్ దాటని జెంగ్ 6-4, 2-6, 7-6 (10-8)తో చైనాకే చెందిన వాంగ్‌ను ఓడించి తుది 16లో చోటు దక్కించుకుంది.
పురుషుల సింగిల్స్‌లో...
పురుషుల సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాజ్, జ్వెరెవ్, మెద్వెదెవ్, నోరీ ముందంజ వేశారు. ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లొస్ అల్కరాజ్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మూడో రౌండ్‌లో షాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్ 6-1, 6-1, 1-0తో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయం కారణంగా వాకొవర్ ఇచ్చాడు. దీంతో అల్కరాజ్ ప్రీ క్వార్టర్‌కు చేరాడు. మూడోసీడ్ మెద్వెదెవ్ 6-3, 6-4, 6-3తో అగర్ అలియాసిమ్ పై నెగ్గగా.. ఆరో సీడ్ జ్వెరెవ్ 6-2, 7-6 (7-4), 6-2తో మిచెల్‌సన్ (అమెరికా)ను ఓడించాడు. పదకొండో సీడ్ కాస్పర్ రూడ్‌కు షాక్ తగిలింది. 4-6, 7-6 (9-7), 4-6, 3-6తో కాస్పర్ రూడ్... నోరి చేతిలో ఓడాడు. కెక్‌మనోవిచ్, హర్కాజ్ , బోర్జెస్ కూడా ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ప్రిక్వార్టర్స్‌లో మన్నారినోతో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ తలపడనున్నాడు.
పురుషుల డబుల్స్‌లో...
పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ-విక్టర్ కార్నెయా (రొమేనియా) జోడీ ఓడిపోయింది. రెండో రౌండ్లో ఈ జంట 3-6, 3-6తో మార్సెలో (ఎల్ సాల్వడార్)-మాట్ పవిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో తలొంచింది. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్న-బబోస్ (హంగేరీ) జంట టోర్నీ నుంచి తప్పుకుంది.