ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్... రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లోనూ పసికూన నెదర్లాండ్స్‌పై కివీస్ ఘన విజయం సాధించింది. అంచనాలకు తగ్గట్లే ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో డచ్ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వని న్యూజిలాండ్... 99 పరుగుల తేడాతో విజయదుంధుభి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించింది. 323 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్... 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కివీస్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కివీస్‌కు ఓపెనర్‌లు డెవాన్ కాన్వే, విల్ యంగ్ శుభారంభం ఇచ్చారు. విల్ యంగ్ (70; 80 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరిశాడు. ఇంగ్లాండ్‌పై భారీ శతకం బాదిన డేవాన్ కాన్వే (32) ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. రచిన్ రవీంద్ర (51; 51 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి ఆకట్టుకున్నాడు. రచిన్ రవీంద్ర ఓపెనర్ విల్ యంగ్‌తో కలిసి చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు స్కోర్ 144 పరుగుల వద్ద యంగ్ 70 అవుటయ్యాడు. 185 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర 51 (3 ఫోర్లు, 1 సిక్సర్) కూడా వెనుదిరిగాడు. వికెట్ కీపర్ టామ్ లాథమ్ (53; 46 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధ శతకం సాధించాడు. డారిల్ మిచెల్ (48; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివర్లో శాంట్నర్ కేవలం 17 బంతుల్లో అజేయంగా 36 పరుగులు చేశాడు. మూడు ఫోర్‌లు, రెండ్ సిక్సర్‌లు బాదాడు. దాంతో జట్టు స్కోర్ నిర్ణీత 50 ఓవర్లలో 322 పరుగులకు చేరింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ డెర్ మెర్వ్, వాన్ మీకెరెన్, ఆర్యన్ దత్ రెండేసి వికెట్ల చొప్పున తీశారు. బాస్ డీ లీడె ఒక వికెట్ తీశాడు.
323 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్... ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. భారత సంతతి ఆటగాడు విక్రమ్ జిత్ సింగ్, మాక్స్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. కానీ వన్‌డౌన్ బ్యాటర్ కోలిన్ నీల్ అకెర్మాన్ అద్భుత అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 73 బంతుల్లో 5 ఫోర్లతో 69 పరుగులు చేసి నెదర్లాండ్స్ మరీ ఘోరంగా పరాజయం పాలవ్వకుండా కాపాడాడు. మిగిలిన బ్యాటర్లందూ ఓ మోస్తరు పరుగులు చేశారు. మిచెల్ శాంటర్న్ అయిదు వికెట్లు నేలకూల్చి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు. హెన్రీ కూడా మూడు వికెట్లు తీశాడు. ఈ ఇద్దరి బౌలర్ల ప్రదర్శనతో 46.3 ఓవర్లలో నెదర్లాండ్స్ 223 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర శతకాలతో చెలరేగడంతో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను న్యూజిలాండ్ చిత్తు చేసింది. బ్రిటీష్ బౌలర్లను ఊచకోత కోసిన కివీస్ బ్యాటర్లు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి.. ఇంగ్లాండ్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని మరో 82 బంతులు మిగిలి ఉండగానే సునాయసంగా ఛేదించారు. 273 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో కాన్వే, రచిన్ రవీంద్ర కివీస్‌కు ఘన విజయం అందించారు.