ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు కలిసిరావడం లేదు! భారీ స్కోరు చేసినప్పటికీ ఓటమి పాలవుతోంది. ఈడెన్‌ పార్క్‌ వేదికగా కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన మ్యాచులో పరాజయం చవిచూసింది. మిథాలీ సేన నిర్దేశించిన 278 పరుగుల టార్గెట్‌ను కంగారూలు సునాయాసంగా ఛేదించారు. 6 వికెట్ల తేడాతో గెలుపు బావుటా ఎగరేశారు. కెప్టెన్‌ మెగ్‌లానింగ్‌ (97; 107 బంతుల్లో 13x4) దుమ్మురేపింది. అలీసా హేలీ (72; 65 బంతుల్లో 9x4), రేచెల్‌ హెయిన్స్‌ (43; 53 బంతుల్లో 5x4) రాణించారు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో యస్తికా భాటియా (59; 83 బంతుల్లో 6x4), మిథాలీ రాజ్‌ (68; 96 బంతుల్లో 4x4, 1x6), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (57 నాటౌట్‌; 47 బంతుల్లో 6x4) హాఫ్‌ సెంచరీలు చేశారు. ఆఖర్లో పూజా వస్త్రాకర్‌ (34; 28 బంతుల్లో 1x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. 


ఆసీస్‌ ఛేదన సింపుల్‌గా సాగింది. ఆ జట్టు ఓపెనర్లు రేచెల్‌ హెయిన్స్‌, అలీసా హేలీ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. సునాయాసంగా బౌండరీలు కొట్టారు. తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం అందించారు. అలీసా అయితే వణికించింది. అయితే 19.2వ బంతికి ఆమెను స్నేహ్‌రాణా పెవిలియన్‌ పంపించింది. 123 వద్ద హెయిన్స్‌ను పూజా ఔట్‌ చేసింది. అప్పుడైనా ఒత్తిడి చేశారా అంటే అదీ లేదు! లూజ్‌ డెలివరీలు వేశారు. దాంతో ఎలిస్‌ పెర్రీ (28) సాయంతో కెప్టెన్‌ మెగ్‌లానింగ్‌ మూడో వికెట్‌కు 103 పరుగుల  భాగస్వామ్యం నిర్మించింది. 226 వద్ద పెర్రీని పూజా ఔట్‌ చేసినా అర్ధశతకం సాధించిన లానింగ్‌ ఆగలేదు. చక్కని కట్‌షాట్లతో పరుగులు రాబట్టింది. బెత్‌మూనీ (30 నాటౌట్‌; 20 బంతుల్లో 4x6) ఆమెకు అండగా నిలిచింది. ఆఖర్లో నాటకీయంగా సెంచరీ ముంగిట లానింగ్‌ ఔటైనా మూనీ విజయం అందించింది.


ఆస్ట్రేలియా ఆడిన ఐదింట్లో ఐదు గెలిచి 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్‌ బెర్త్‌ కన్ఫామ్‌ చేసుకుంది. టీమ్‌ఇండియా రెండు విజయాలు, మూడు అపజయాలతో 4 పాయింట్లు సాధించింది. మెరుగైన రన్‌రేట్‌ వల్ల నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత జరిగే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌పై గెలిస్తేనే సెమీస్‌ చేరుకునే అవకాశాలు ఉంటాయి.