ICC Womens Cricket World Cup: టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు సృష్టించబోతోంది! అత్యధికసార్లు ప్రపంచకప్‌లు ఆడిన ఘనత అందుకోబోతోంది. దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, జావెద్ మియాందాద్ సరసన నిలవనుంది.
సచిన్ సరసన
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు అత్యధికసార్లు ప్రపంచకప్‌లు ఆడింది ఇద్దరే ఇద్దరు. ఒకరు టీమ్‌ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్. మరొకరు పాకిస్థాన్ ఫైర్ బ్యాటర్ జావెద్ మియాందాద్. అయితే వీరి రికార్డును మిథాలీ రాజ్ సమం చేయబోతోంది. ఐసీసీ 2020 మహిళల వన్డే ప్రపంచకప్ ఆడటం ద్వారా ఆమె ఈ జాబితాలో చేరబోతోంది. ఇది ఆమె ఆడబోయే ఆరో ప్రపంచకప్ కావడం ప్రత్యేకం.
పాక్‌తో మొదలు
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో మార్చి 6న దాయాది పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా తలపడుతోంది. ఈ టోర్నీలో మిథాలీసేనకు ఇదే మొదటి మ్యాచ్. ఇప్పటి వరకు అమ్మాయిల జట్టును రెండుసార్లు ఫైనల్‌కు చేర్చిన ఘనత మిథాలీ పేరుతోనే ఉంది. 2005, 2017లో టీమ్‌ఇండియాను ఫైనల్ చేర్చింది. వయసు పెరగడం, వన్డే ప్రపంచకప్ తేవాలన్న కలతో ఆమె కొన్నాళ్ల క్రితం టీ20 ఫార్మాట్‌కు దూరమైంది. పరుగులు చేయడంలో ఆమెకెవరూ సాటిరారు. 225 వన్డేల్లో 7623 పరుగులు చేసింది. ఇక మరో సీనియర్ క్రికెటర్ జులన్ గోస్వామి ఐదో ప్రపంచకప్ ఆడబోతోంది.
టీమ్‌ఇండియాలో యువ క్రికెటర్లు బాగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని మిథాలీ అంటోంది. 'మా జట్టులోని యువ క్రికెటర్లకు నేను చెప్పేదొకటే. వారికి ఇంతకు ముందు ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం లేదు. అందుకే ఈ బిగ్‌స్టేజ్ పైన క్రికెట్‌ను ఎంజాయ్ చేయాలని సూచించాను' అని మిథాలీ పేర్కొంది.
మార్చి 6 నుంచి టీమ్‌ఇండియా పోరాటం
Womens World Cup 2022: మార్చి 4 నుంచి న్యూజిలాండ్ వేదికగా ఐసీసీ మహిళల క్రికెట్ వన్డే ప్రపంచకప్ మొదలవుతోంది. మొత్తం ఎనిమిది జట్లు 29 రోజులు ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను గెలవలేదు. కానీ రెండు సార్లు ట్రోఫీని ముద్దాడే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. రన్నరప్‌గా నిలిచింది. చివరి ప్రపంచకప్ ఫైనల్లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలై కన్నీరు కార్చింది. ఈ సారి ఎలాగైనా ట్రోఫీ అందుకోవాలని పట్టుదలతో ఉంది. మార్చి 6, ఆదివారం నుంచి మిథాలీ సేన తమ క్యాంపెయిన్ ఆరంభించనుంది. తొలి మ్యాచులోనే దాయాది పాకిస్థాన్‌తో తలపడుతోంది.
India Women Squad - టీమ్‌ఇండియా జట్టు
మిథాలీ రాజ్ (Mithali Raj captain), హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur), స్మృతి మంధాన (Smriti Mandhana), షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రానా, జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్