చిన్న వయసులోనే గుండె జబ్బులు, బీపీలు, షుగర్ వ్యాధులు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రోగాలు. ఎందుకిలా వచ్చేస్తున్నాయి అని చర్చించుకుంటాం కానీ మనం ఏం తింటున్నాం? ఏం తాగుతున్నాం అన్నవిషయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోండి. మనం తినే అతి తిండి వల్ల కూడా కొన్ని రోగాలు విరుచుకుపడతాయి.మితిమీరి మాంసం తినడం వల్ల ఆరోగ్యపరిస్థితుల్లో తేడా రావచ్చు. మాంసాహారంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. శరీరంలో మోతాదుకు మించి ప్రోటీన్ చేరడం వల్ల కూడా అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. రోజూ ముక్క లేనిదే ముద్ద దిగని వారు ఎంతో మంది. అలాంటి వారు మోతాదుకు మించి మాంసం తినడం వల్ల వచ్చే రోగాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. 


గుండె వ్యాధులు
అధిక మాంసాహారం తినడం వల్ల శరీరంలో కొవ్వు, ఉప్పు అధికంగా పేరుకుంటుంది. ఈ రెండు కూడా హైబీపీని పెంచుతాయి. కొలెస్ట్రాల్ అనారోగ్యాకారకం. కాబట్టి ఈ రెండూ కలిపి గుండె సంబంధ వ్యాధులను కలిగిస్తాయి. 


అధిక బరువు
బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా మాంసాహారాన్ని చాలా వరకు తగ్గించాలి. అతిగా తింటే బరువు పెరిగే సమస్య కూడా మొదలవుతుంది. బరువు తగ్గే ప్రక్రియలో అదనపు కిలోలను తగ్గించుకోవాలి కానీ మాంసాహారం ద్వారా  మరిన్ని కేలరీలను, కిలోలను అదనంగా చేర్చుకుంటునారు మాంసాహారులు. ముఖ్యంగా రెడ్ మీట్ వల్లే సమస్య అధికం. 


మధుమేహులకు ఇబ్బందే
మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. జీవనశైలిలో మార్పులను ఈ వ్యాధి తట్టుకోలేదు. అధిక మాంసాహారం తినడం వల్ల బరువు పెరగడం, కొవ్వు పేరుకుపోవడం వంటివి కలుగుతాయి. ఇవి మధుమేహుల్లో అనేక ఆరోగ్యసమస్యలకు కారణమవుతుంది. 


అధికంగా చెమట పట్టడం
‘మీట్ స్వెట్స్’ఇదొక చిన్న ఆరోగ్య సమస్య. మాంసం అధికంగా తినడం వల్ల చెమట కూడా అధికంగా పడుతుంది. దీన్నే వైద్య పరిభాషలో అలా పిలుస్తారు. ఇలా చెమట అధికంగా పట్టడం వల్ల శరీర దుర్వాసన కూడా పెరుగుతుంది. 


క్యాన్సర్
అధికంగా మాంసాహారం తినడం క్యాన్సర్ కచ్చితంగా వస్తుందని చెప్పే ఆధారాలు లేవు, కానీ కొన్ని అధ్యయనాలు మాత్రం వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా బీఫ్, మటన్ వంటి వాటివల్లే సమస్య అధికమవుతుంది. 


కాబట్టి మాంసాహారాన్ని కప్పుల కొద్దీ లాగించకుండా పరిమితంగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. ఇప్పటివకే అతిగా తిన్నవారు ఓసారి ఆరోగ్యపరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. 



Also read: మీ కుటుంబచరిత్రలో ఎవరికైనా క్యాన్సర్ ఉందా? అయితే వీటిని తినడం మానేయండి, రిస్క్ తగ్గుతుంది