ICC Womens World cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది! మిథాలీ సేన ఒకటి తలిస్తే వరుణ దేవుడు మరొకటి తలిచాడు. గురువారం నాటి మ్యాచుల్లోని ఫలితాలు భారత జట్టుకు చావోరేవో పరిస్థితులను క్రియేట్‌ చేశాయి. సెమీస్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేశాయి.


ఇప్పటివరకు ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా (India Womens cricket team) ఆరు మ్యాచులు ఆడింది. మూడు గెలిచి మూడు ఓడింది. అయితే విజయం సాధించిన మూడింట్లోనూ భారీ తేడాతో గెలవడం మిథాలీ సేనకు కలిసొచ్చింది. తొలి మ్యాచులో పాక్‌పై 107 పరుగులతో ఇండియా దుమ్మురేపింది. వెస్టిండీస్‌నైతే ఏకంగా 155 తేడాతో ఓడించింది. తాజాగా బంగ్లాను 110తో చిత్తు చేసింది. ఇలా భారీ తేడాతో గెలవడం కివీస్‌ చేతిలో 62 తేడాతో ఓడటం, ఇంగ్లాండ్‌, ఆసీస చేతిలో వరుసగా 4, 6 వికెట్ల తేడాతో ఓడిన ప్రభావాన్ని తగ్గించింది. + 0.768 తేడాతో మొన్నటి వరకు మూడో స్థానంలో నిలిచేలా చేసింది.


నిజానికి టీమ్‌ఇండియా సెమీస్‌ ఆశలకు అడ్డంగా నిలిచింది ఇప్పుడు ఒక్క వెస్టిండీస్‌ మాత్రమే! గురువారం ఆ జట్టు దక్షిణాఫ్రికాతో ఆఖరి లీగ్‌ మ్యాచును ఆడేసింది. ఇందులో ఓడిపోతే మిథాలీసేనకు ఎలాంటి దిగులు ఉండేది కాదు. వారికి నెగెటివ్‌ రన్‌రేట్‌ ఉండటం వల్ల 6 పాయింట్లతో మన వెనకే ఉండేది. అయితే నేటి మ్యాచులో వర్షం కురవడం వల్ల  మ్యాచ్‌ సాగలేదు. దక్షిణాఫ్రికా 10.5 ఓవర్లకు 61/4తో ఉన్నప్పుడు వరుణుడు వచ్చేశాడు. ఎంతకీ  తెరపి ఇవ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేసి చెరో పాయింట్‌ ఇచ్చారు. దాంతో 7 పాయింట్లతో విండీస్‌ మూడో స్థానంలోకి వెళ్లింది.


మరోవైపు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో ఇంగ్లాండ్‌ అమ్మాయిలు భారీ తేడాతో గెలిచారు. పాక్‌ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 19.2 ఓవర్లలో 9 వికెట్ల తేడాతో ఛేదించేసింది. రన్‌రేట్‌ను అనూహ్యంగా ఇంప్రూవ్‌ చేసుకుంది. దాంతో 6 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో భారత్‌ 6 పాయింట్లతో ఐదో స్థానానికి వచ్చింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌, భారత్‌కు ఒకే మ్యాచ్‌ మిగిలుంది. ఆంగ్లేయులు బంగ్లా, టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంది. అంటే మనం సెమీస్‌ చేరాలంటే దక్షిణాఫ్రికాను కచ్చితంగా ఓడించాల్సిందే. ఒకవేళ అందులో మనం, బంగ్లా చేతిలో ఇంగ్లాండ్‌ ఓడితే మనకు అవకాశం ఉండొచ్చు. ఇవేవీ వద్దనుకుంటే కచ్చితంగా ఎనిమిది పాయింట్లు సాధించడమే మార్గం.