India Women Cricket Team: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో (ICC Womens Worldcup) మిథాలీ సేన ఆశలు నిలబెట్టుకొంది! సెమీస్ అవకాశాలను పటిష్ఠం చేసుకుంది. బంగ్లాదేశ్‌పై 110 పరుగుల తేడాతో విజయం సాధించడం ఇందుకు దోహదం చేసింది. ఇండియా అమ్మాయిలు (India Womens team) మెగాటోర్నీలో మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఆ పోరులో ఓడితే పరిస్థితి ఏంటో చూద్దాం?


ఇప్పటివరకు ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా (India Womens cricket team) ఆరు మ్యాచులు ఆడింది. మూడు గెలిచి మూడు ఓడింది. అయితే విజయం సాధించిన మూడింట్లోనూ భారీ తేడాతో గెలవడం మిథాలీ సేనకు కలిసొచ్చింది. తొలి మ్యాచులో పాక్‌పై 107 పరుగులతో ఇండియా దుమ్మురేపింది. వెస్టిండీస్‌నైతే ఏకంగా 155 తేడాతో ఓడించింది. తాజాగా బంగ్లాను 110తో చిత్తు చేసింది. ఇలా భారీ తేడాతో గెలవడం కివీస్‌ చేతిలో 62 తేడాతో ఓడటం, ఇంగ్లాండ్‌, ఆసీస చేతిలో వరుసగా 4, 6 వికెట్ల తేడాతో ఓడిన ప్రభావాన్ని తగ్గించింది. + 0.768 తేడాతో మూడో స్థానంలో నిలిచేలా చేసింది.







భారత్‌ లీగ్‌ దశలో మరొక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాలి. 28న దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. అందులో గెలిస్తే ఎలాంటి ఫికర్‌ లేకుండా సెమీస్‌ దూసుకెళ్లొచ్చు. లేదంటే మన సెమీస్‌ ఆశలకు అడ్డంగా నిలిచేది కేవలం వెస్టిండీస్‌ మాత్రమే. ఈ జట్టు ఆరింట్లో మూడు గెలిచి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. వీరికి నెగెటివ్‌ రన్‌రేట్‌ (-0.885) ఉండటం టీమ్‌ఇండియాకు అదృష్టంగా మారింది. విండీస్‌ 24న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఇప్పటికే  ఐదింట్లో 4 గెలిచిన సఫారీలు 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచులో సఫారీ జట్టు గెలిస్తే మిథాలీ సేన గెలుపోటములతో సంబంధం లేకుండా సెమీస్‌ చేరుకుంటుంది.






ఒకవేళ విండీస్‌ గెలిస్తే మాత్రం ఇంగ్లాండ్‌ తర్వాతి రెండు మ్యాచుల్లో ఓడిపోవాలి. బంగ్లా, పాక్‌ వారిని ఓడించాలి. అప్పుడు మనం నిశ్చింతగా సెమీస్‌కు వెళ్తాం. లేదా ఒక్కదాంట్లోనైనా ఓడిపోతే రన్‌రేట్‌ను బట్టి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ఇవేవీ వద్దనుకుంటే దక్షిణాఫ్రికాను ఓడిస్తే బెటర్‌! పైగా వారిపై మనకు మంచి రికార్డే ఉంది. అయితే ఈ టోర్నీలో మాత్రం సఫారీలు జోరుగా ఆడుతున్నారు కాబట్టి పక్కాగా ప్లాన్‌ చేసి గెలవాలి.


మ్యాచులో ఏం జరిగిందంటే: తప్పక గెలవాల్సిన మ్యాచులో అమ్మాయిలు అద్భుతం చేశారు! సెమీస్‌కు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచులో దుమ్మురేపారు! ఐసీసీ మహిళల వన్డే మ్యాచులో మిథాలీ సేన మూడో విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌ను ఏకంగా 110 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 230 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 40.౩ ఓవర్లకు 119కే కుప్పకూల్చింది. స్నేహ్‌రాణా (4/30) తన స్పిన్‌తో బంగ్లా పతనాన్ని శాసించింది. లతా మొండల్‌ (24), సల్మా ఖాటూన్‌ (32) టాప్‌ స్కోరర్లు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో యస్తికా భాటియా (50; 80 బంతుల్లో 2x4), షెఫాలీ వర్మ (42; 32 బంతుల్లో 6x4, 1x6) అదరగొట్టారు.


Also Read: బంగ్లా టైగర్స్‌ను చిత్తు చేసిన అమ్మాయిలు - సెమీస్‌కు మంచి ఛాన్స్‌!