ICC Test Rankings Virat Kohli drops out of top-10 after Edgbaston failure, Rishabh Pant storms to No.5 : టీమ్‌ఇండియా వికెట్ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్ పంత్‌  (Rishabh Pant) దూసుకుపోతున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో (ICC Test Rankings) టాప్‌-5లో అడుగుపెట్టాడు. మరోవైపు కింగ్‌ కోహ్లీ ర్యాంకు మరింత దిగజారింది. టాప్‌-10లో చోటు కోల్పోయాడు. 13వ స్థానానికి చేరుకున్నాడు.


ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచులో విరాట్‌ కోహ్లీ రెండు ఇన్నింగ్సుల్లో వరుసగా 11, 20 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రిషభ్ పంత్‌ తొలి ఇన్నింగ్సులో 111 బంతుల్లోనే 146 రన్స్‌ కొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 57తో అర్ధశతకం అందుకున్నాడు. చివరి 6 టెస్టు ఇన్నింగ్సుల్లో పంత్ రెండు శతకాలు, మూడు అర్ధశతకాలు బాదేశాడు. దాంతో ఆరు ర్యాంకులు మెరుగై కెరీర్‌ బెస్ట్‌ టాప్‌-5 అందుకున్నాడు.


Also Read: 18 నెలల్లో కోహ్లీ రన్స్‌ కన్నా 25 రోజుల్లో బెయిర్‌స్టో కొట్టిందే ఎక్కువట!


భీకరమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ (Joe Root) అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 923 రేటింగ్‌ పాయింట్లతో తిరుగులేని పటిష్ఠ స్థితిలో ఉన్నాడు. పైగా ఐదో టెస్టు రెండో ఇన్నింగ్సులో 142తో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఐసీసీ అత్యధిక రేటింగ్‌ పొందిన టాప్‌-20 బ్యాటర్ల జాబితాలో ప్రవేశించాడు. రెండు ఇన్నింగ్సుల్లోనూ రెండు సెంచరీలు కొట్టిన జానీ బెయిర్ స్టో (Jonny Bairstow) 11 స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకుకు ఎగబాకాడు. అతడు కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు.


బౌలింగ్‌ జాబితాలో ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 900 రేటింగ్‌ పాయింట్లతో ఉన్నాడు. టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 842 రేటింగ్‌తో రెండో ర్యాంకులో ఉన్నాడు. పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా 828 రేటింగ్‌తో మూడులో కంటిన్యూ అవుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడ్డూ, యాష్ వరుసగా 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్‌ జాబితాలో మయాంక్‌ అగర్వాల్‌ 22, చెతేశ్వర్‌ పుజారా 26లో ఉన్నారు.