ICC తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ 5వ స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్... కోహ్లీని వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకాడు. 






ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు సారథి జో రూట్ 64, 109 పరుగులు సాధించాడు. దీంతో అతడి ఖాతాలోకి 49 పాయింట్లు వచ్చి చేరాయి. ఇదే మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ గోల్డెన్ డకౌటయ్యాడు. వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో కోహ్లీ ఖాతాలోకి ఎలాంటి పాయింట్లు చేరలేదు. కోహ్లీ కంటే వెనుక ఉన్న రూట్ తాజాగా జత కలిసిన 45 పాయింట్ల కారణంగా కోహ్లీని వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి దూసుకెళ్లాడు. దీంతో కోహ్లీ 791పాయింట్లతో 5వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.



న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 901 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... స్టీవ్ స్మిత్ (891), మార్నస్ లంబుషైన్ (878) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ(764), రిషబ్ పంత్ (746) ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు. 



ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో రాణించిన భారత బౌలర్ బుమ్రా 760 పాయింట్లతో టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 9వ స్థానంలో నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ (856) 2వ స్థానంలో ఉన్నాడు.   



భారత్Xఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు గురువారం ప్రారంభంకానుంది. లార్డ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ పర్యటనలో తొలి టెస్టు ద్వారా పరుగుల ఖాతానే తెరవని కోహ్లీ రెండో టెస్టులో ఫామ్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. లార్డ్స్ మైదానంలో కోహ్లీ ఇప్పటి వరకు  టెస్టుల్లో శతకం సాధించలేదు. భారత్ తరఫున ఇప్పటి వరకు కేవలం 9 మంది మాత్రమే లార్డ్స్‌లో టెస్టుల్లో సెంచరీ బాదారు. మరీ, రెండో టెస్టులో కోహ్లీ లార్డ్స్ వేదికలో సెంచరీ చేస్తాడా?