ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ దుమ్మురేపాడు. కొన్ని రోజులుగా కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్న సూర్య.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో 838 రేటింగ్ పాయింట్లతో రెండోస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.


రిజ్వాన్‌తో పోటీ


ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 854 పాయింట్లతో నం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. రిజ్వాన్‌కి కేవలం 16 పాయింట్ల దూరంలో సూర్య ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో సూర్య కుమార్.. హాఫ్ సెంచరీ చేసి ఉంటే అగ్రస్థానానికి చేరుకునేవాడు.


అయితే ఆ మ్యాచ్‌లో అతని బ్యాటింగ్ ఆర్డర్‌ని నం.4 నుంచి నం.5కి టీమిండియా మేనేజ్‌మెంట్ మార్చింది. ఆ మ్యాచ్‌లో 6 బంతులే ఎదుర్కొన్న సూర్య ఒక సిక్స్ కొట్టి వెంటనే ఔటైపోయాడు.


ఒకేఒక్కడు


టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10 లిస్ట్‌లో భారత్ నుంచి సూర్యకుమార్ యాదవ్ మాత్రమే ఉన్నాడు. కేఎల్ రాహుల్ (606), విరాట్ కోహ్లీ (605), రోహిత్ శర్మ (604) వరుసగా 14,15,16వ స్థానాల్లో నిలిచారు. 


కెరీర్ బెస్ట్ ఫామ్


ఇటీవల గువాహటి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఫోర్లు, సిక్సర్లతో సఫారీలపై సూర్య విరుచుకుపడ్డాడు. అంతకుముందు హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ స్కై రాణించాడు. తాజాగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫన్నీ కామెంట్స్ చేశాడు.


ప్రపంచకప్‌ టోర్నీ ముందు జట్టును ఆందోళన పరుస్తున్న అతిపెద్ద అంశం ఏమిటని విలేకరులు రోహిత్‌ను అడగ్గా.. ఇందుకు సరదాగా స్పందించాడు. "ఒక్కటని చెప్పలేం.. మేం దృష్టి సారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అందులో సూర్యకుమార్‌ ఫామ్‌ కూడా ఒకటి" అంటూ నవ్వుతూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు.


సూర్య కుమార్‌ యాదవ్‌ కూడా ఓ ప్రశ్నకు ఇదే తరహాలో సమాధానం ఇచ్చాడు. "దినేశ్‌ కార్తిక్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే.. నంబర్‌ 4 స్థానానికి ఎసరొచ్చేలా ఉంది" అని అన్నాడు.


దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో దినేశ్‌ కార్తీక్.. 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో దినేశ్ (46) ఒక్కడే రాణించాడు. 


ఈ నెల 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ 2022 జరగనుంది. ఈ టోర్నీలో భాగంగా భారత్ జట్టు తన ఫస్ట్ మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో 23న మెల్‌బోర్న్ వేదికగా ఢీ కొట్టనుంది.


అయితే టీమ్‌ఇండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా జట్టుకు దూరం కావడం అభిమానుల్లో కలవరం రేపుతోంది. జట్టులో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. బీసీసీఐ ఇంకా దీనిపై స్పష్టతనివ్వలేదు. అయితే పేసర్‌ మహమ్మద్‌ షమీని అతడి స్థానంలో ఆడిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. 


Also Read: WI T20 World Cup Squad: టీ20 వరల్డ్ కప్ నుంచి హిట్‌మేయర్ ఔట్, ఇలా కూడా జట్టులో చోటు కోల్పోతారా


Also Read: Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!