JK Encounter: జమ్ముకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు- నలుగురు ఉగ్రవాదులు హతం

ABP Desam   |  Murali Krishna   |  05 Oct 2022 02:46 PM (IST)

JK Encounter: జమ్ముకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

(Image Source: PTI)

JK Encounter: జమ్ముకశ్మీర్‌లో బుధవారం రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ముకశ్మీర్ డీజీపీ (జైళ్ల శాఖ) హత్యకు గురైన మరుసటి రోజే ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి.

ఇదీ జరిగింది

షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం ముగ్గురు జైషే మహ్మద్ (జేఇఎం) ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాది హతమయ్యారు. షోపియాన్‌లోని మూలు, ద్రాచ్ ప్రాంతాల్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

షోపియన్‌లోని ద్రాచ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.                               -  కశ్మీర్ జోన్ పోలీసులు

డీజీపీ హత్య

జమ్ముకశ్మీర్ డీజీపీ (జైళ్ల విభాగం) హేమంత్ కుమార్ లోహియా సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తోన్న డీజీపీ ఇంటి సహాయకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

రాత్రంతా జమ్ముకశ్మీర్ పోలీసులు నిందితుడి కోసం గాలించారు. చివరికి డీజీ హేమంత్ కుమార్ లోహియా హత్య కేసులో కీలక నిందితుడు యాసిర్ లోహర్‌ను పట్టుకున్నాం. విచారణ మొదలైంది.                                                       "
-ముఖేశ్ సింగ్, ఏడీజీపీ 

1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్, జమ్ముకశ్మీర్‌ డీజీపీ (జైళ్ల విభాగం) హేమంత్ కుమార్ లోహియాను దారుణంగా హత్య చేశారు. తన ఇంటి సహాయకుడి చేతిలోనే ఆయన హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తన ఇంట్లో పనిచేసే వ్యక్తి యాసిర్ లోహర్.. ఆయన గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు.

ఇలా హత్య

డీజీ లోహియా తన ఇంటికి మరమ్మతులు చేయిస్తుండటంతో జమ్ము శివారులోని తన స్నేహితుడి ఇంట్లో ఉంటున్నారు. ఆయన గొంతు కోసిన ఆనవాళ్లతో పాటు, ఒంటిపై కాలిన గాయాలున్నాయి. తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఇంటి సహాయకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కెచప్‌ బాటిల్ పగులకొట్టి గొంతుకోసి, తర్వాత ఆ మృతదేహాన్ని మంటల్లో కాల్చేయాలని ప్రయత్నించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మంటలు రావడం గుర్తించి భద్రతా సిబ్బంది ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే గది లోపలి నుంచి గడియపెట్టి ఉన్నట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

మేమే చేశాం

అయితే ఈ హత్యకు తామే బాధ్యులమంటూ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్(పీఏఎఫ్ఎఫ్‌) అనే ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. పటిష్ట భద్రత మధ్య కశ్మీర్ పర్యటనకు రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఇది మా గిఫ్ట్ అంటూ పీఏఎఫ్ఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. 

షా పర్యటన

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తారు. ఇలాంటి సందర్భంలో డీజీ హత్యకు గురికావడంతో కలకలం రేగింది. దీంతో ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు.

Also Read: Elon Musk Twitter Deal: ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ నిజమే: ట్విట్టర్ ప్రకటన

Also Read: Pauri Garhwal Bus Accident: పండగ పూట విషాదం- లోయలో పడిన బస్సు, 25 మంది మృతి!

Published at: 05 Oct 2022 02:23 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.