ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా బంతితో మ్యాజిక్ చేయడంతో ఆస్ట్రేలియా 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1: 7 బంతుల్లో), వన్‌డౌన్‌లో వచ్చిన మిషెల్ మార్ష్‌లను(0: 1 బంతి) అశ్విన్ వెనక్కి పంపగా, మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ను (8: 10 బంతుల్లో, ఒక ఫోర్) జడేజా అవుట్ చేశాడు. ఆ తర్వాత స్టీఫెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (37: 28 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది.
అయితే ఆ తర్వాత వీరు మరీ నిదానంగా ఆడటంతో స్కోరు నత్తనడకన ముందుకు సాగింది. దీంతో మొదటి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 74 పరుగులు మాత్రమే సాధించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న మ్యాక్స్‌వెల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి రాహుల్ చాహర్ భారత్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత స్మిత్ గేర్లు మార్చడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ వేగం పుంజుకుంది.
15 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి స్మిత్ తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. 41 బంతుల్లో స్మిత్ ఈ అర్థశతకం సాధించాడు.
ఆ తర్వాత స్మిత్‌తో పాటు స్టాయినిస్ కూడా దూకుడుగా ఆడటంతో ఒక దశలో 160 పరుగుల చేస్తుందనింపించినా.. చివరి ఓవర్లలో భువీ అద్బుతంగా బౌలింగ్ చేసి ఆరు పరుగులు మాత్రమే ఇవ్వడంతో పాటు స్మిత్ వికెట్ కూడా తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఆరు ఓవర్లలో ఆస్ట్రేలియా ఏకంగా 66 పరుగులు చేయడం విశేషం.
భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. జడేజా, భువీ, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీశారు. భారత జట్టు విజయానికి 120 బంతుల్లో 153 పరుగులు చేస్తే సరిపోతుంది.
Also Read: విజయంతో వరల్డ్ కప్ ఖాతా తెరిచిన టీమిండియా.. ఏడు వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు
Also Read: టీ20 ప్రపంచకప్‌లో ముందే ఫైనల్ ఆడేస్తున్న కోహ్లీసేన! ఇప్పటి వరకు పాక్‌పై తిరుగులేని భారత్
Also Read: కూతురితో కోహ్లీ ఫొటో.. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా మొత్తం హృదయం’ అన్న అనుష్క!