World Athletics Championships: ఆదివారం ముగిసిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ - 2023లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కొత్త చరిత్ర లిఖించాడు. ఈ పోటీలలో ఇప్పటివరకూ ఏ భారత అథ్లెట్‌కు సాధించని విధంగా.. గోల్డ్ గెలుచుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మరి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో తొలి స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రాకు వచ్చిన ప్రైజ్ మనీ ఎంత..?
బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా ఆదివారం ముగిసిన జావెలిన్ త్రో ఫైనల్‌లో 88.17 మీటర్లు విసిరి పసిడి పతకం నెగ్గిన నీరజ్ చోప్రాకు 70 వేల యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 58 లక్షలు. ఇక ఇవే పోటీలలో ఈటను 87.82 మీటర్ల దూరం విసిరి రజతం సాధించిన పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌కు 35వేల యూఎస్ డాలర్ల (సుమారు రూ. 29 లక్షలు) ప్రైజ్ మనీ వచ్చింది.
12 మంది పాల్గొన్న జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్‌లో నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు కూడా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. కిషోర్ జెన (84.14 మీటర్లు), డీపీ మను (84.14 మీటర్లు) మెరుగైన ప్రదర్శన చేశారు. కిషోర్ జెనాకు తన కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.
తాజాగా స్వర్ణం సాధించడంతో నీరజ్ చోప్రా సీనియర్ లెవల్‌లో దాదాపు అన్ని టోర్నీలలో నెంబర్ వన్ స్థానంలో స్వర్ణం నెగ్గిన అతి కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ కంటే ముందు అతడు సౌత్ ఏషియన్ గేమ్స్ (2016), ఏషియన్ ఛాంపియన్‌షిప్స్ (2017), కామన్వెల్త్ గేమ్స్ (2018), ఏషియన్ గేమ్స్ (2018), ఒలింపిక్స్ (2020) డైమండ్ లీగ్ (2022)లలో స్వర్ణ పతకాలు గెలుచుకున్నాడు. అంతేగాక ఈ విజయంతో అతడు వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లో స్వర్ణం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. అంతేగాక అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిస్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన రెండో క్రీడాకారుడుగాను నిలిచాడు. బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్‌తో 2016 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాలు నెగ్గాడు.
అంతర్జాతీయ స్థాయిలో చూసుకుంటే జావెలిన్ త్రో లో ఒలింపిక్స్‌తో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన అథ్లెట్లలో నీరజ్ మూడోవాడు. గతంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన దిగ్గజ జావెలిన్ త్రోయర్ జాన్ జెలెంజీ, నార్వే అథ్లెట్ ఆండ్రీస్ తొర్కిల్డ్సన్ మాత్రమే ఈ ఘనత సాధించినవారిలో ఉన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial