Hockey World Cup 2023:  పురుషుల హాకీ ప్రపంచకప్ 2023 జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఒడిశా ఆతిథ్యం ఇస్తోంది. బుధవారం ఈ టోర్నీ ప్రారంభ వేడుకను బారాబతి మైదానంలో అట్టహాసంగా నిర్వహించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రపంచకప్ ఆరంభ వేడుకను ప్రారంభించారు. 


పురుషుల హాకీ ప్రపంచకప్ వచ్చేసింది. మ్యాచ్ ల నిర్వహణ కన్నా 2 రోజుల ముందే టోర్నీ ఆరంభ వేడుకలను నిర్వహించారు. బారాబతి స్టేడియంలో ఒడిశా సంప్రదాయ నృత్యాలు, సంగీతంతో కళాకారులు అలరించారు. బాలీవుడ్ నటులు రణ్ వీర్ సింగ్, దిశా పటానీలు నృత్య ప్రదర్శన ఇచ్చారు. 16 దేశాలు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. జనవరి 13న జరుగనున్న పూల్ మ్యాచ్‌లతో హాకీ ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. జనవరి 29న జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌ తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన ప్రపంచ కప్ జట్టుగా ఉన్న పాకిస్థాన్ 2023 ఎడిషన్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇప్పటివరకు భారత్ 4 సార్లు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. అయితే ఆతిథ్య హోదాలో భారత్ కప్పును అందుకోలేకపోయింది.  


ఉత్తమ ఆతిథ్యం ఇస్తాం


ప్రపంచకప్ ఆరంభ వేడుకలను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. టోర్నీలో పాల్గొంటున్న 16 దేశాలకు స్వాగతం పలికారు. ఉత్తమ ఆతిథ్యంతో మెప్పిస్తామని.. ప్రతి అతిథి మధుర జ్ఞాపకాలతో తిరిగి వెళ్లేలా చూస్తామని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు తయ్యబ్‌ ఇక్రం, హాకీ ఇండియా ఛైర్మన్‌ దిలీప్‌ టిర్కీ హాజరయ్యారు. ఒడిశాను హాకీ నేలగా తయ్యబ్ ఇక్రం ప్రశంసించారు. 


నగరవాసులు ప్రారంభ వేడుకలను వీక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నగర ప్రధాన ప్రాంతాల్లో 16 చోట్ల భారీ తెరలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో 500 డ్రోన్లతో ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.