మలేషియా వేదికగా జరుగుతున్న జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో యువ భారత జట్టు సత్తా చాటింది. పూల్‌ సిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కెనడాను చిత్తుచిత్తుగా ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏకంగా 10-1 తేడాతో కెనడాపై జూనియర్‌ టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది. తొలి క్వార్టర్‌ ఎనిమిదో నిమిషంలో ప్రారంభమైన భారత్‌ గోల్‌ల వర్షం 58వ నిమిషం వరకు కొనసాగింది. భారత జోరు ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్థిని వరుస గోల్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేసిన టీమిండియా ఇక మూడో సారి జూనియర్‌ ప్రపంచకప్‌ గెలిచేందుకు మూడడుగుల దూరంలోనే నిలిచింది. 


ఆదిత్య (8వ, 43వ), రోహిత్‌ (12వ, 55వ), అమన్‌దీప్‌ (23వ, 52వ) రెండేసి గోల్స్‌ కొట్టగా.. విష్ణుకాంత్‌ (42వ), రాజిందర్‌ (42వ), సౌరభ్‌ (51వ), ఉత్తమ్‌ సింగ్‌ (58వ) ఒక్కో గోల్‌ సాధించారు. కెనడా తరఫున ఏకైక గోల్‌ను నికోల్‌సన్‌ (20వ) కొట్టాడు. దీంతో పూల్‌-సిలో 3 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లతో రెండో స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ ప్రదర్శనతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్‌ సీ గ్రూపులో 9 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. మంగళవారం క్వార్టర్స్‌లో పూల్‌-డి విజేత నెదర్లాండ్స్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ ఇదే ఆటతీరుతో భారత్‌ గెలిస్తే సెమీస్‌లో అడుగు పెడుతుంది.


జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో యువ భారత్‌(Bharat) శుభారంభం చేసింది. మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. బలమైన కొరియాపై 4-2తో విజయం సాధించింది. అర్జీత్‌ సింగ్‌ హుందాల్‌(Araijeet Singh Hundal) హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టడంతో పూల్‌-సి మ్యాచ్‌లో 4-2తో కొరియా(South Korea)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా ప్రత్యర్థి జట్టు పుంజుకునేందుకు అవకాశమే ఇవ్వలేదు. 11వ నిమిషంలో అర్జీత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. రెండో క్వార్టర్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు గోల్స్‌ పడ్డాయి. 16వ నిమిషంలో అర్జీత్‌ సింగ్‌, 30వ నిమిషంలో అమన్‌దీప్‌ గోల్స్‌ చేయడంతో భారత్‌ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి విజయాన్ని ఖరారు చేసుకుంది. కానీ మూడో క్వార్టర్‌లో కొరియా కాస్త పుంజుకుంది. 38వ నిమిషంలో లిమ్‌ చేసిన గోల్‌తో కొరియా ఖాతా తెరిచింది. కానీ వెంటనే అర్జిత్‌ సింగ్‌ 41వ నిమిషంలో హ్యాట్రిక్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ 4-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.


రెండో మ్యాచ్‌లో భారత్‌ 1-4 తేడాతో పరాజయం పాలైంది. పెనాల్టీకార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో విఫలం కావడం, బలహీనమైన డిఫెన్స్‌ భారత్‌ను దెబ్బ కొట్టాయి. తొలి పోరులోవిజయంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన భారత్‌ మైదానంలో కుదురుకోక ముందే కాబ్రీ ఫీల్డ్‌ గోల్‌తో ఝలక్‌ ఇచ్చాడు. ఈ పరిణామంతో ఒక్కసారిగా విస్తుపోయిన భారత్‌ ఏదశలోనూ పుంజుకోలేక పోయింది. ఆట తొలి నిమిషంలోనే స్పెయిన్‌ ఆటగాడు కాబ్రె గోల్‌ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వతా ఆండియ్రాన్‌ రఫీ 18వ నిమిషంలో మరో గోల్‌ చేయడంతో తొలి క్వార్టర్‌లోనే స్పెయిన్‌ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో క్వార్టర్‌ ఆరంభమైన మూడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రోహిత్‌ గోల్‌గా మలచడంతో భారత్‌ 1-2తో నిలిచింది. కానీ ఆ తర్వాత 41వ నిమిషంలో కాబ్రీ మరో గోల్‌ చేయగా 60వ నిమిషంలో ఆండ్రియాస్‌ రఫీ మరో గోల్‌ చేశాడు. వీళ్లిద్దరూ చెరో రెండు గోల్స్‌తో అదరగొట్టడంతో స్పెయిన్‌కు ఎదురేలేకుండా పోయింది.