UK 100-Day Cough Symptoms:



యూకేలో దగ్గు జబ్బు..


చైనాలో ఇప్పటికే ఫ్లూ కేసులు (China Flu Cases) విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాప్తితో ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది. ఇక్కడా కొన్ని ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అయితే...చైనాలో వ్యాప్తి చెందిన ఫ్లూ కేసులకు వీటికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయినా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఈ ఆందోళన చాలదన్నట్టు ఇప్పుడు యూకేలోనూ ఓ వ్యాధి వ్యాప్తి చెందుతోంది.  "100-day cough" ఆ దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. చాలా తొందరగా ఒకరి నుంచి మరొకరికి సోకుతోందని ఇప్పటికే యూకే హెల్త్‌ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. యూకే వ్యాప్తంగా పలు చోట్ల ఈ కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే 250% మేర కేసులు పెరిగినట్టు అక్కడి వైద్యులు వెల్లడించారు. సాధారణ జలుబుగా మొదలై క్రమంగా లక్షణాలు పెరుగుతున్నాయి. దాదాపు మూడు నెలల పాటు విపరీతమైన దగ్గుతో సతమతం అవుతున్నారు బాధితులు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UK 100 Day Cough) లెక్కల ప్రకారం...జులై, నవంబర్ మధ్య కాలంలో 716 కేసులు నమోదయ్యాయి. వైద్యులు ఈ వ్యాధిని Pertussis గా చెబుతున్నారు. నేరుగా ఊపిరితిత్తులకు సోకుతుందీ వైరస్. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఈ కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా నమోదవుతున్నాయి. 


చిన్నారులకే ప్రమాదం..


నిజానికి కొవిడ్ సమయంలో ఈ కేసులు చాలా వరకూ తగ్గిపోయాయి. భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం సహా మరి కొన్ని ఆంక్షల కారణంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ..ఇప్పుడలాంటి ఆంక్షలేమీ లేకపోవడం వల్ల పెర్టుసిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధి Bordetella pertussis bacteria కారణంగా సోకుతుంది. ఈ వ్యాధినే Whooping Cough గా పిలుస్తున్నారు వైద్యులు. గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి నేరుగా వెళ్తుంది బ్యాక్టీరియా. గతంలో చాలా మంది చిన్నారులను బలి తీసుకుంది. 1950ల్లో ఈ వ్యాధి కట్టడికి వ్యాక్సిన్ తయారు చేశారు. కానీ..ఇప్పుడది ప్రభావం చూపించడం లేదు. ఇప్పుడు చిన్నారులనే కాకుండా పెద్దలనీ ఇబ్బందులకు గురి చేస్తోంది ఈ దగ్గు. ఈ బ్యాక్టీరియా వల్ల హెర్నియా, యూరినరీపై నియంత్రణ కోల్పోవడం, చెవిలో ఇన్‌ఫెక్షన్‌లు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరి తీసుకోవడమూ ఇబ్బందిగానే ఉంటుంది. విపరీతమైన దగ్గు కారణంగా వాంతులూ అయ్యే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి అందిస్తున్న వ్యాక్సిన్ కొంత వరకూ మెరుగ్గానే పని చేస్తోందని, చిన్నారులను కాపాడుకునేందుకు అవకాశముందని అంటున్నారు.